వాన కురిసింది.. పంట మురిసింది.. వర్షాలు ఇంకా ఎన్నిరోజులంటే..

రెండు రోజులుగా కురిసిన వర్షాలతో ఎండిపోయే దశకు చేరిన పంటలకు కొత్త జీవం వచ్చింది. కంభం, బేస్తవారపేట, అర్ధవీడు ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పసుపు, కంది, పత్తి, అరటి, మిరప, వరి పంటలు కళకళలాడుతున్నాయి. వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాలతో రైతులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వాన కురిసింది.. పంట మురిసింది.. వర్షాలు ఇంకా ఎన్నిరోజులంటే..
Markapuram News

Edited By:

Updated on: Aug 25, 2026 | 7:51 PM

కంభంలో జీవం పోసుకున్న పసుపు… వర్షానికి కలకలలాడుతున్న అరటి… నిన్నటి వరకు ఎల్‌నినో ప్రభావంతో వర్షం లేక ఎండిపోతున్న పంటలకు రెండు రోజులుగా కురిసిన వాన పంటలకు జీవం పోసింది… రైతులకు ఆనందం పంచింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. మరో మూడు రోజులపాటు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది.. అయితే.. వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఏపీలోని చాలా ప్రాంతాలతోపాటు.. మార్కాపురం జిల్లా కంభం వ్యవసాయ సబ్ డివిజన్లో వర్షాలు లేక వేసిన పంటలు బెట్టదశకు వచ్చాయి. పంటలు ఎండిపోతాయన్న భయంతో అన్నదాతలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న తెల్లవారుజామున కంభం చుట్టుపక్కల ప్రాంతంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈ వర్షానికి ఎండి పోయేందుకు సిద్దంగా ఉన్న పంటలన్నీ జీవం పోసుకుని కళకళలాడుతున్నాయి.

ఈ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరించినట్టుగానే ఈ ఏడాది జూన్‌ నుంచి ప్రారంభం కావాల్సిన వర్షాల జాడ లేకుండా పోయింది. ఆగస్టు నెల చివరి వారం ముగుస్తున్నా చినుకు జాడ కనిపించలేదు. మార్కాపురంజిల్లాలోని కంభం, అర్థవీడు, బేస్తవారపేట మండలాలలో వేసిన కంది, పసుపు, పత్తి, అరటి, మిరప, వరి పంటలు వర్షాలు లేక, పొడి వాతావరణ ప్రభావం వల్ల దోమ పోటుకు గురవుతున్నాయి. ఇక వర్షం కురిసే అవకాశం లేదన్న నిరాశతో ఉన్న రైతులకు అనుకోని అతిధిలా వచ్చిన వర్షం స్వాంతన చేకూర్చింది.

సోమవారం తెల్లవారుజామున కంభం మండలంలో 16. 4 మి.మీ, బేస్తవారిపేట మండలంలో 12.8 మి.మీ, అర్ధవీడు మండలంలో 4.2 మి.మీ వర్షపాతం కురవ డంతో దోమపోటు బారి నుండి పంటలు బయటపడ్డాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మున్ముందు కూడా వర్షాలు కురిస్తే తమ పంటలకు తిరుగుండదని పేర్కొంటున్నారు. అయితే.. వచ్చే రెండు రోజులు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంటుండంతో అన్నదాతలు హర్షం వ్యక్తంచేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us