Rain Alert In AP: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ తరుణంలో బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది. దీంతో ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది. కాగా.. ఉత్తర అండమాన్ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న తీవ్ర వాయుగుండం మరింత బలపడింది. ఉత్తరం వైపు గడచిన 06 గంటల్లో 20 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తూర్పున కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్ర వాయుగుండం మాయాబందర్‌కు ఈశాన్యంగా 290 కి.మీ. దూరములో (అండమాన్ దీవులు), పోర్ట్ బ్లెయిర్ (అండమాన్ దీవులు)కి ఈశాన్యంగా 420 కి.మీ దూరములో యాంగోన్ (మయన్మార్)కి నైరుతి దిశలో 270 కి.మీ.దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది అండమాన్ దీవుల నుంచి దాదాపు ఉత్తరం వైపు కదులుతూ ఈ రోజు మయన్మార్ తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా మూడు రోజులపాటు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన:
ఉత్తర కోస్తా ఆంధ్ర – యానాం: ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈరోజు ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రా: ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది.
రాయలసీమ: ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
Also Read: