చీరాల, నవంబర్ 30: రైళ్లలో టీసీల పేరుతో కొందరు దొంగలు కొత్త రకం దోపిడీలకు పాల్పడుతున్నారు. టికెట్‌లేని ప్రయాణికులే వీరి టార్గెట్. మెడలో నకిలీ రైల్వే ఐడీ కార్డు, నకిలీ రశీదు బుక్‌తో చూడడానికి నిజమైన టికెట్ కలెక్టర్‌లా మాట్లాడుతూ టికెట్ తీసుకోని ప్రయాణికులకు జరిమానాలు విధిస్తూ పెద్దమొత్తంలో ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నారు. విజయవాడ నుంచి నెల్లూరు వరకు రైళ్లలో సంచరిస్తూ కొన్ని రైళ్లలోనే ఈ రకం దోపిడీలకు పాల్పడుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రవర్తిస్తూ జరిమానాలు విధిస్తూ ప్రయాణికులను అడ్డంగా దోచుకుంటున్నారు. తాజాగా ఈ వ్యవహారం చీరాలలో గుట్టురట్టయింది. దీనిపై రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తెలంగాణకు చెందిన ముగ్గురు యువకులను మంగళవారం బాపట్ల జిల్లా చీరాల రైల్వేస్టేషన్‌లో అదుపులోకి తీసుకుని విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాపట్ల జిల్లా భట్టిప్రోలుకు చెందిన ఉప్పు సాయి ప్రసాద్ తెనాలిలో ఉంటున్నాడు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్మరానికి చెందిన జి గణేష్, వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గొడ్లకొండ గ్రామానికి చెందిన బొంతా కళ్యాణ్, మహబూబాబాద్ జిల్లా నెల్లికోడూరు మండలం పెద్దతండాకు చెందిన బి ప్రవీణ్.. ఈ ముగ్గురూ నిరుద్యోగుల. వీరి వద్ద లక్షల రూపాయలు తీసుకుని నకిలీ పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చి నకిలీ ఐడీ కార్డులు, జరిమానా పుస్తకాలు అందజేశాడు. అంతేకాకుండా వారిని తనతో ఉంచుకుని విజయవాడ – నెల్లూరు మధ్య రైళ్లలో టీసీలుగా అవతారమెత్తించాడు. రోజూ అతడే డ్యూటీలు వేయించి ఏ రైలు ఎక్కాలో, ఎక్కడ ఎక్కాలో అతడే నిర్ణయించేవాడు. టికెట్ లేకుండా ప్రయాణించేవారికి భారీగా జరిమానాలు విధించి అధికమొత్తంలో వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు.
తొలుత శిక్షణ పేరుతో విజయవాడ-నెల్లూరు మధ్య రైళ్లలో తిరుగుతూ రోజుకు కనీసం మూడు కేసులు రాయాలని చెప్పాడు. ఇదంతా నిజమేనని నమ్మిన ఆ యువకులు టికెట్ లేని ప్రయాణికులకు జరిమానా విధిస్తూ ఆ డబ్బు తెచ్చి తెనాలి వ్యక్తికి అందజేస్తూ వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో చీరాలకు వచ్చిన వారు చీరాల రైల్వేస్టేషన్‌లో కేసులు రాస్తున్న గణేష్‌ను స్థానిక టీటీఈ రాజేష్ గమనించాడు. అనుమానం వచ్చి అతన్ని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. ఆయన రైల్వే పోలీసులకు చెప్పగా వారు గణేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు మరో ఇద్దరిని కూడా జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. తెనాలికి చెందిన అసలు నిందితుడి కోసం గాలిస్తున్నారు. వీరితోపాటు మరికొందరు నకిలీ టీసీలు ఉన్నారని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. ముగ్గురూ మైనర్లు కావడంతో వారికి 41 నోటీసులు జారీ చేశారు. వ్యవహారంపై విచారణ జరుగుతోందని, దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.