Andhra Pradesh – JNTUA: అనంతపురం జేఎన్‌టీయూఏలో ర్యాగింగ్ సంఘటన కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులపై వికృత చేష్టలకు పాల్పడుతూ అర్ధరాత్రి వరకు వేధిస్తున్న సీనియర్ విద్యార్థులపై వేటు పడింది. అసలేం జరిగిందంటే.. గతంలో ర్యాగింగ్ ఫ్రీగా ఉన్న అనంతపురం జేఎన్టీయూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులను హాస్టల్లో సీనియర్లు వేధిస్తున్న సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాస్తవంగా జేఎన్టీయూలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్స్ ఉన్నాయి. అయితే సీనియర్లు మాత్రం ఆరుగురు జూనియర్ విద్యార్థులను తమ గదుల్లోకి పిలిపించి అర్ధరాత్రి దాకా అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయించడంతో పాటు సిగరెట్లు, మద్యం తీసుకొచ్చి ఇవ్వాలని వేధించినట్లు తెలుస్తోంది. అలాగే గంటల తరబడి నిల్చోబెట్టడం.. తమ వ్యక్తిగత పనులు చేయించుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
కాగా, సీనియర్ల వేధింపుల తాళలేక కొందరు విద్యార్థులు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం ప్రిన్సిపల్ సుజాత సడెన్ విజిట్ చేశారు. అప్పటికే ఇద్దరు ముగ్గరు జూనియర్లు హాస్టల్లో కనిపించలేదు. ఆరాతీస్తే సీనియర్లు ఉంటున్న గదులకు వెళ్లినట్టు తెలిసింది. దీంతో జూనియర్ విద్యార్థులను విచారించగా.. సుమారు 18 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కి పాల్పడుతున్నట్లు గుర్తించారు. వారిని వెంటనే సస్పెండ్ చేశారు ప్రిన్సిపల్ సుజాత. వారు ఇకపై హాస్టల్ కి, క్లాసులకు రాకూడదని ఆదేశించారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిలో కెమికల్, కంప్యూటర్ సైన్సెస్ గ్రూప్ సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. అదే సమయంలో చెప్పా పెట్టకుండా సెకండ్ షో సినిమాకు వెళ్లిన మరో ముగ్గరు జూనియర్ విద్యార్థులను కూడా సస్పెండ్ చేసినట్టు ప్రిన్సిపల్ తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై ఒక కమిటీ కూడా వేస్తున్నట్టు తెలిపారామె.
Also read:
POLICE: యువతిని గదిలో బంధించిన పోలీసు.. 40రోజుల పాటు చిత్రహింసలు
Tanguturu Insident: తల్లీకూతుళ్ల హత్య కేసులో విస్తుగొలిపే వాస్తవాలు.. అసలు ఏం జరిగిందంటే..
AP Corona Cases: తగ్గు ముఖం పట్టిన కరోనా ప్రభావం.. ఏపీలో భారీగా తగ్గిన పాజిటివ్‌ల సంఖ్య..