Andhra Pradesh: పుష్ప లెవల్ స్కెచ్ సామీ.. లారీలోనే వైన్స్ పెట్టేశారు.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..
సినిమాలో పుష్పరాజ్ పాల ట్యాంకర్‌లో ఎర్రచందనం దాస్తే.. ఇక్కడ ఘరానా స్మగ్లర్లు లారీ క్యాబిన్‌లో స్పెషల్ బాక్సులు పెట్టి గోవా మద్యాన్ని సరిహద్దులు దాటించారు. సినిమాను మించిన ప్లాన్‌తో వచ్చిన ఈ ముఠా గుట్టును అనంతపురం పోలీసులు చాకచక్యంగా రట్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పుష్ప సినిమాలో పాల ట్యాంకర్‌లో ప్రత్యేక అరలు ఏర్పాటు చేసి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన సీన్‌ను గుర్తుచేస్తూ.. అనంతపురం జిల్లాలో అదే తరహాలో సాగుతున్న గోవా మద్యం అక్రమ రవాణా గుట్టును పోలీసులు రట్టు చేశారు. లారీ క్యాబిన్‌లో రహస్య బాక్సులు ఏర్పాటు చేసి గోవా నుంచి తీసుకొచ్చిన భారీ మద్యం నిల్వలను తాడిపత్రి పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి రైల్వే స్టేషన్ సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన ఓ లారీపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పైకి సాధారణ లారీలా కనిపిస్తున్నప్పటికీ, క్యాబిన్ వెనుక భాగంలో అత్యంత చాకచక్యంగా ప్రత్యేక బాక్సులు తయారు చేసినట్లు గుర్తించి ఖాకీలే ఆశ్చర్యపోయారు. ఆ అరలను తెరిచి చూడగా భారీగా గోవా మద్యం బయటపడింది.
ముఠా అక్రమ రవాణా ప్లాన్ ఇలా
సీక్రెట్ అరల్లో దాచిన దాదాపు 400 గోవా మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కళ్లుగప్పేందుకు నిందితులు లారీకి రెండు వేర్వేరు నంబర్ ప్లేట్లను ఉపయోగించారు. ఏపీ, కర్ణాటక రిజిస్ట్రేషన్ ప్లేట్లను మారుస్తూ మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులను సునాయాసంగా దాటించి తాడిపత్రికి చేర్చారు. పోలీసుల రాకను గమనించిన లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి పరారయ్యారు.
కేసు నమోదు.. దర్యాప్తు ముమ్మరం
గోవా నుంచి తాడిపత్రికి ఈ మద్యం ఎవరి కోసం తీసుకొచ్చారు? ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు? అనే కోణంలో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. లారీతో పాటు మద్యం బాటిళ్లను సీజ్ చేసిన తాడిపత్రి పోలీసులు, పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
