
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌తో భేటీ అయ్యారు. పూర్వోదయ పథకం కింద ఏపీకి ఆర్థికసాయం చేయాలని కోరారు. పూర్వోదయ పథకం నిధులతో ఏపీలోని పలు ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు నిర్మలాసీతారామన్‌కు తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.. అనంతరం కేంద్రం జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సాగునీటి ప్రాజెక్టు నిధుల అంశంపై చర్చించారు. సీఎం వెంట కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు, రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నారు.
దేశంలోని తూర్పు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం గతేడాది కేంద్రం పూర్వోదయ పథకానికి శ్రీకారం చుట్టింది. పూర్వోదయ పథకంలో బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే.. పూర్వోదయ నిధులతో ఏపీలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సీఎం చంద్రబాబు.. నిర్మలాసీతారామన్‌కి వివరించారు. ప్రధానంగా.. రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, జీడి, కొబ్బరి తోటలు, కోస్తాంధ్రలో ఆక్వా కల్చర్‌ను ప్రోత్సహించేలా యాక్షన్ ప్లాన్ తయారు చేసినట్లు తెలిపారు. ఆయా రంగాల్లో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం పూర్వోదయ పథకంలో నిధులు కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.
వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధికి పూర్వోదయ పథకం అమలు ఎంతో ఉపయోగపడుతుందన్నారు సీఎం చంద్రబాబు. ఆయా ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా నిధులు ఇవ్వాలని నిర్మలాసీతారామన్‌ను కోరారు. ఇక.. దేశానికి తూర్పున ఉన్న ఐదు రాష్ట్రాల అభివృద్ధికి పూర్వోదయ పథకం అమలు చేయబోతున్నట్లు కేంద్రప్రభుత్వం గతేడాది బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక ప్రణాళిక ప్రకటించింది. బిహార్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌కు ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ అప్పట్లో ప్రకటించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..