
ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదు.. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే జైలు పాలు అవ్వాల్సిందే అంటూ మరోసారి గుర్తు చేసింది కోర్టు. దండించాల్సిన ఉపాధ్యాయులు బెత్తం చేతబట్టి తీవ్రంగా దాడి చేస్తే కఠిన శిక్ష తప్పదని రుజువైంది. హోంవర్క్ చేయలేదని టీచర్లు ఓ బాలుడిని బెత్తంతో కొట్టారు. అయితే ఉపాధ్యాయులు కొట్టిన దెబ్బలకు ఆ బాలుడు మృతి చెందాడు. 2014 జరిగిన ఈ ఘటనకు సంబంధించి 11 ఏళ్ల తర్వాత ఇద్దరు ఉపాధ్యాయులకు తాజాగా జైలు శిక్ష పడింది.. ఇటీవల కాలంలో స్కూల్లో విద్యార్థులు క్రమశిక్షణతో ఉండడం లేదన్న సందర్భాలు అనేకం ఉన్నాయి.. సరిగా చదవకపోవడం.. హోం వర్క్ చేయకపోవడం లాంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. దశాబ్దం క్రితం వరకు విద్యార్థుల పట్ల టీచర్లు కఠినంగా వ్యవహరించాలని తల్లిదండ్రులే చెప్పేవారు. అలా అని విద్యార్థుల ప్రాణాలు తీసే విధంగా వ్యవహరించకూడదనే స్పృహ కొద్ది మంది టీచర్లకు లేదు అన్నది అనేక సందర్బాల్లో నిరూపితమైంది..
నెల్లూరు జిల్లా కావలిలోని శ్రీ విద్యానికేతన్ ప్రైవేట్ స్కూల్లో 2014లోఐదో తరగతి చదువుతున్నాడు వెంకట సాయి కృష్ణ. పరీక్షల సమయంలో కాపీ కొడుతున్నాడని ఒక కారణంతో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని కౌసల్యా అనే ఉపాధ్యాయురాలు అమానుషంగా కొట్టింది. దీంతో సాయి కృష్ణ హెడ్‌మాస్టర్‌కు చెప్పగా అయన సైతం విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైన వెంకట సాయి కృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారం రోజుల తర్వాత మృతి చెందాడు. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నివేదిక సైతం ఉపాధ్యాయులు కొట్టిన దెబ్బలకి సాయి కృష్ణ మృతి చెందాడని రావడంతో కేసు నమోదు చేశారు. 12 ఏళ్లుగా విచారణలో ఉన్న కేసులో న్యాయమూర్తి శనివారం తుదితీర్పు ఇచ్చారు. బాలుడిపై అమానుషంగా దాడి చేసిన టీచర్ కౌసల్య, హెచ్ఎం అయ్యన్నకు ఐదేళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చారు. తమ బిడ్డ మృతికి కారణమైన ఉపాధ్యాయులకు శిక్ష పడటంపై వెంకట సాయి కృష్ణ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. మరో విద్యార్థికి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని వారు కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..