వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం జనవరి 8 బుధవారం ఉదయం బైరాగిపట్టెడ సెంటర్‌కు భారీగా చేరుకున్నారు భక్తులు. టోకెన్ల జారీ మొదలుపెట్టే వరకూ పక్కనే ఉన్న పద్మావతి పార్క్‌లోకి భక్తుల్ని పంపారు పోలీసులు. అయితే రాత్రి ఓ భక్తురాలు అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించేందుకు గేటు తీశారు డీఎస్పీ రమణకుమార్.. గేటు ఎందుకు తీశారో భక్తులకు చెప్పకపోవడంతో ఒక్కసారిగా భక్తులు ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఘటనలో ఆరుగురు చనిపోగా.. 41 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారుల తీరు, తీసుకున్న చర్యలపై సీఎం చంద్రబాబుకు ఇప్పటికే ప్రాథమిక నివేదిక వెళ్లింది. తొక్కిసలాట ఘటనకు అధికారుల వైఫల్యమే కారణమని రిపోర్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలాఉంటే.. తిరుపతిలో జరిగిన విషాద సంఘటన సమాచారం అందిన వెంటనే సీఎం స్పందించారు. మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్ లను తిరుపతి వెళ్లాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో వారు వెంటనే తిరుపతి చేరుకొని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..