
గిరిజనుల డోలీ కష్టాలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. అసలే వానలు..ఆపై అస్తవ్యస్తమైన రోడ్లు.. దీంతో హాస్పిటల్‌కి వెళ్లాలంటే నరకయాతన తప్పడం లేదు. విజయనగరం జిల్లాలో మరో హృదయవిదారక ఘటన అందర్నీ విస్తుపోయేలా చేసింది. మెంటాడ మండలం ఎనుగువలసలో నంద్యాన కాసులమ్మ అనే గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. కంగారుపడ్డ కుటుంబసభ్యులు ఆమెను డోలీ సాయంతో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. దాదాపు 10కిలోమీటర్లు వాగులు, వంకలు, పొలాల మధ్య డోలీలో కాసులమ్మను హాస్పిటల్‌కి తరలించే ప్రయత్నం చేశారు. కానీ మార్గం మధ్యలో పురిటినొప్పులు ఎక్కువై కాసులమ్మ ప్రసవించింది. మరికొంత దూరం తల్లిబిడ్డను తీసుకెళ్లి అంబులెన్స్ సాయంతో స్థానిక పీహెచ్‌సీ తరలించారు.
అటు విశాఖలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. గులాబ్ తుపానుతో వాగులు వంకలు పొంగిపొర్లడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో అనంతగిరి మండలం మల్లిపాడు గ్రామానికి చెందిన సోడిపల్లి లక్ష్మి అనే గర్భిణీకి పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే ఆమెను డోలీ సాయంతో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. దాదాపు 2 కిలోమీటర్లు తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యలో గడ్డ వాగు పొర్లుతుండడంతో ఇవతలి వైపు నుంచి అవతలి వైపునకు వెళ్లలేకపోయారు. అదే సమయంలో పెయిన్స్ ఎక్కువ కావడంతో వెంట తెచ్చుకున్న గొడుగుల్ని అడ్డుగా పెట్టి నాటుపద్దతిలో డెలివరీ చేశారు.
సుఖ ప్రసవం కావడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికి గండం గడిచింది. కానీ ఈ ఇబ్బందులు, సమస్యలు ఎప్పటినుంచో స్థానికుల్ని వేధిస్తున్నాయి. గర్భిణులు హాస్పిటల్‌కి వెళ్లాలంటే డోలీనే పెద్ద దిక్కు అవుతుంది. ఇక వర్షాలు పడితే ఆ బాధలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. ఇప్పటికైనా తమ ప్రాంతాల్లో రోడ్డు మార్గం వేయాలని విఙ్ఞప్తి చేస్తున్నారు స్థానికులు.
Also Read: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన హీరోయిన్ పూనమ్ కౌర్ ట్వీట్స్
నిమిషం వ్యవధిలో భార్యాభర్తలు మృతి… ఆ దృశ్యం చూసి డాక్టర్ల ఉద్వేగం