
అనంతపురం జిల్లా, అక్టోబర్ 3: ఆ గర్భిణీ మరి కాసేపట్లోనే పండంటి బిడ్డకు జన్మనిస్తుందని ఆమె కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఎదురుచూస్తున్నారు. అనుకున్నట్టే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన బిడ్డ కాసేపటికి చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యుల ఆశలు, సంతోషం ఆదిలోనే ఆవిరయ్యాయి. అప్పుడే పుట్టిన బిడ్డ చనిపోయిందని దుఃఖంలో ఉండగానే.. మరికాసేపటికి ఆ తల్లి కూడా చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లి, బిడ్డ చనిపోయారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎగుపల్లి గ్రామానికి చెందిన మహాలక్ష్మి పురిటి నొప్పులతో అనంతపురం పట్టణంలోని అమరావతి హాస్పిటల్‌కు వళ్లింది. వైద్యులు డెలివరీ చేయగా.. బిడ్డ పుట్టింది. కానీ అంతలోనే ఏమైందో బిడ్డ చనిపోయింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసే లోపే ఆ తల్లి కూడా చనిపోవడంతో మహాలక్ష్మి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే డెలివరీ అయిన తర్వాత కూడా మహాలక్ష్మి తమతో మాట్లాడిందని.. కానీ అంతలోనే ఎందుకు తల్లి, బిడ్డ చనిపోయారో తమకు కారణం కూడా వైద్యులు చెప్పడం లేదని.. ఆ కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇంతకి దారుణం జరిగిందని, హాస్పిటల్ నిర్వాకంపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని మహాలక్ష్మి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..