Srisailam: శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. తెల్లరేషన్ కార్డు ఉంటే..

|

Apr 21, 2023 | 1:20 PM

ధర్మప్రచారంలో భాగంగా శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. పేద భక్తులు స్వామివారి సేవలో ఉచితంగా భాగమయ్యేందుకు అవకాశం కల్పించింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Srisailam: శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. తెల్లరేషన్ కార్డు ఉంటే..
Srisailam Temple
Follow us on

శ్రీశైలం మల్లన్న భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. ధర్మప్రచారంలో భాగంగా తెల్లరేషన్ కార్డు కలిగిన సామాన్య భక్తుల కోసం ప్రతిమాసంలో ఒక రోజున ఉచిత సామూహిక సేవలను నూతనంగా ప్రవేశపెట్టింది. ఈ సేవలను దేవస్థానం మొదటిసారి నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన భక్తుల సౌకర్యార్థం ఈ సదుపాయం కల్పించామన్నారు. అందులో భాగంగా ఈ నెల 25వ తేదీన ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని సామూహిక అభిషేకాన్ని చంద్రవతి కల్యాణమండపంలో నిర్వహిస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు.  ఈ ఉచిత సామూహిక సేవలో పాల్గొనదలచిన భక్తులు శ్రీశైలం దేవస్థానం వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఈ నెల 19 నుండి భక్తులకు ఈ టికెట్స్ అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రతీ మాసములో భక్తులకు 250 టికెట్లు మాత్రమే ఆన్లైన్‌లో అందుబాటులో ఉంటాయన్నారు.  ఈ సేవలలో దంపతులు లేదా ఒక మనిషి మాత్రమే పాల్గొనవచ్చన్నారు. అయితే ఉచిత సామూహిక సేవలలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలని.. ఆన్లైన్ ద్వారా సేవ నమోదు చేసుకునే సమయంలో భక్తులు వారి  తెల్లరేషన్ కార్డు స్కానింగ్ చేసి అప్లోడ్ చేయాల్సివుంటుందన్నారు.  తెల్లరేషన్ కార్డు లేనివారిని అనుమతించమని ఈవో లవన్న తెలిపారు.

అయితే 25న నిర్వహించనున్న ఉచిత సామూహిక అభిషేకంలో పాల్గొనే భక్తులకు అభిషేకానంతరం ప్రత్యేక క్యూలైన్ ద్వారా శ్రీస్వామివారి అలంకార దర్శనం ఉంటుందని.. అలానే అమ్మవారి దర్శనంతో పాటు శ్రీ వృద్ధమల్లికార్జునస్వామివారి స్పర్శదర్శనం కల్పిచబడుతుందని చెప్పారు.  ఈ సేవలో పాల్గొన్న భక్తులకు 2 లడ్డు ప్రసాదాలు, కుంకుమ, విభూతి, కైలాస కంకణాలు, శ్రీశైలప్రభ పుస్తకం ,కండువా, రవిక వస్త్రం అందిస్తామని తెలిపారు. దర్శనానంతరం దేవస్థానం అన్నపూర్ణభవనం నందు భోజన సదుపాయం కల్పించబడుతుందని ఈ ఉచిత సేవలన్ని తెల్లరేషన్ కార్డు కలిగిన భక్తులు వినియోగించుకోవాలని ఈవో లవన్న సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..