ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీకి కీలకమైన మైలవరం, పెనమలూరు స్థానాలపై టీడీపీ అధిష్ఠానం దృష్టిసారించింది. ఈ రెండు స్థానాలు ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలు. దీంతో తిరిగి ఆయా స్థానాల్లో పాత వైభవం తెచ్చుకునేలా అభ్యర్థులను బరిలో దించాలని పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు.
మైలవరం అభ్యర్థి ఎంపిక పార్టీకి తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్… వైసీపీని వదిలి సైకిలెక్కింది మొదలు.. మైలవరం రాజకీయం హాట్ హాట్‌గా మారింది. మైలవరం టికెట్ కోసం ఇప్పటికే దేవినేని ఉమ, బొమ్మసాని సుబ్బారావు మధ్య టిక్కెట్ పోరు నడుస్తుండగా… వసంత చేరిక కొత్త రచ్చకు కారణమవుతోంది. ఇన్నాళ్లూ ఒకే పార్టీలో ఉంటూ ఉప్పూ,నిప్పులా ఉన్న ఉమ, సుబ్బారావు.. ఇప్పుడు ఒక్కటైపోయారు. టికెట్ కోసం కలిసి పోరాడాలని నిర్ణయించారు. అయితే మైలవరం టికెట్ వసంతకు దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. దీంతో దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావులను చంద్రబాబు ఏ విధంగా ఒప్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.