NTR Health University: హెల్త్ యూనివర్శిటీ పేరుపై రాజకీయ రగడ మొదలైంది. అసెంబ్లీ, మండలిలో రగడ నడిచింది. సభ బయట కూడా మాటల యుద్ధం మొదలైంది. వైఎస్‌కు అనుకూలంగా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే, ఎన్టీఆర్ పేరు తీసేస్తామనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. వర్శిటీ పేరు మార్పును తీవ్రంగా ఖండించారు చంద్రబాబు. ఆ వర్శిటీతో వైఎస్‌ఆర్‌కు ఏం సంబంధమని ట్వీట్టర్‌లో ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరును కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేశారు. యూనివర్సిటీకి చెందిన రూ. 450 కోట్లను జగన్ ప్రభుత్వం కాజేసిందని ఆరోపించారు. 1998లో పెట్టిన ఎన్టీఆర్ పేరును మార్చాలని ఆ తర్వాత వచ్చిన ఏ ముఖ్యమంత్రీ ఆలోచన చేయలేదని పేర్కొన్నారు. ఇప్పుడా పేరును మార్చాలన్న పిచ్చి ఆలోచనలను మానుకోవాలని సూచించారు.
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు.
రాష్ట్రంలో వైఎస్‌ఆర్, జగన్ తప్ప మరో పేరు పెట్టకూడదా అని ప్రశ్నించారు టీడీపీ నేత పయ్యావుల కేశవ్. స్టిక్కర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. వర్శిటీ పేరు మార్పుపై ఆన్‌లైన్ ఓటింగ్ పెడితే వైసీపీ నేతలు కూడా వ్యతిరేకిస్తారన్నారు పయ్యావుల. దేవినేని ఉమ కూడా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు ప్రకటన నేపథ్యంలో గొల్లపూడిలో తీవ్ర ఉద్రిక్తంగా నెలకొంది. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు తీసేసి వైస్సార్ పేరు పెట్టాడనికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు దేవినేని ఉమ. రోడ్డుపైనే బైఠాయించారు ఉమ. ఈ ధర్నాతో అలర్ట్ అయిన పోలీసులు, టీడీపీ నాయకులను అరెస్ట్ చేశారు. వారిని స్టేషన్‌కు తరలించే క్రమంలో పోలీసులకు, నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఎంపీ కేశినేని తీవ్రంగా స్పందించారు. హెల్త్ యూనివర్సిటీకి, ఎన్టీఆర్‌కు ఉన్న సంబంధం గురించి వివరిస్తూ.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాజకీయాలకు అతీతంగా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఉండటం వంద శాతం కరెక్ట్ అన్నారు. ఎన్టీఆర్ పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదని, ఆ నిర్ణయాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు ఎంపీ కేశినేని.
ఈ నిర్ణయంపై బీజేపీ నేతలు సైతం మండిపడుతున్నారు. ఎపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి మాట్లాడారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ప్రభుత్వాలు మారితే పేరు మారుస్తారా? అని ప్రశ్నించారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు యధాతదంగా ఉంచాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు.
ఇదిలాఉంటే.. టీడీపీ నేతల ఆరోపణల్ని ఖండించారు మంత్రి జోగి రమేష్. సీఎం జగన్ ఎన్టీఆర్‌కు సరైన గౌరవం ఇచ్చారన్నారు. అందుకే జిల్లాకు ఆయన పేరు పెట్టారని చెప్పారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ కూడా రియాక్ట్ అయ్యారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. ప్రజా సమస్యలు చర్చకు రాకూడదనే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వైద్య రంగంలో వైఎస్ఆర్ అనేక మార్పులు తీసుకువచ్చారని, ఆరోగ్య శ్రీ ప్రధాత అయిన వైఎస్ఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి ప్రతిపాదిస్తే టీడీపీకి భయం పట్టుకుందన్నారు. ఎన్టీఆర్ చనిపోవడానికి కారణమే చంద్రబాబు అని, ఆరోగ్యశ్రీలో ఎన్టీఆర్ పేరు తొలగిస్తానని చంద్రబాబు చెప్పలేదా? అని ప్రశ్నించారు మంత్రి వేణుగోపాల కృష్ణ. చంద్రబాబు తన కొడుకు విషయంలో ప్రష్టేషన్‌లో ఉన్నాడని, టీడీపీ కుట్రలు రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరారు మంత్రి వేణుగోపాల కృష్ణ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..