AP Politics: అమిత్‌షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఇంట్రస్ట్‌ను ఒక్కసారిగా పెంచేసింది. వారిద్దరూ అరగంటకుపైగా ప్రత్యేకంగా మాట్లాడుకోవడం ఆసక్తిగా మారింది. సినిమా గురించే మాట్లాడుకున్నారా, రాజకీయాలూ చర్చించారా అనేది తెలియకపోయినా ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్‌తో సన్నిహితంగా మెలిగిన, ఆయనతో సినిమాలు తీసిన కొడాలి నాని(Kodali Nani) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా బీజేపీకి లబ్ధిలేనిదే..ఏ ఒక్కరినీ అమిత్‌షా, మోదీ(PM Modi) ద్వయం కలవరని స్పష్టం చేశారు. పాన్ ఇండియా స్టార్ అయిన ఎన్టీఆర్‌తో దేశ వ్యాప్తంగా ప్రచారం చేయించుకునే అవకాశం ఉందన్నారు కొడాలి నాని. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలియదంటూనే, కచ్చితంగా రాజకీయ కారణమే అయి ఉంటుందన్నారు. టీడీపీ మాత్రం ఈ భేటీ వెనుక రాజకీయ కారణాలు లేవని చెబుతోంది. వారిద్దరూ సినిమా గురించే మాట్లాడుకున్నారన్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy).. అమిత్‌షా-జూ.ఎన్టీఆర్ భేటీలో సీనియర్ ఎన్టీఆర్ గురించి వివరాలు అడిగి అమిత్‌షా ఆసక్తిగా తెలుసుకున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలపై కామెంట్స్ చేయనని తెలిపారు. మరోవైపు ఈ భేటీ తర్వాత బీజేపీ నేతల్లో కొంత జోష్ కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో కీలక పరిణామాలు ఉంటాయని వ్యాఖ్యానించారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి.
జూనియర్ ఎన్టీఆర్ భేటీపై కేంద్ర మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అత్యంత ప్రభావంతమైన నటుడు అన్నారు ఆయన. తెలుగు సినిమా తారక రత్నం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి మాట్లాడటం ఆనందంగా ఉందన్నారు అమిత్ షా. అయితే అమిత్ షా.. ఎన్టీఆర్ భేటీలో వాళ్లిద్దరు మాత్రమే ఉన్నారు. లోపల ఏం మాట్లాడుకున్నారో తెలీదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.
అమిత్ షా తెలంగాణ వచ్చింది మునుగోడు మీటింగ్ కోసం. కానీ దానికన్నా జూనియర్ ఎన్టీఆర్‌తో జరిగిన భేటీనే హైలైట్ అవ్వుతోంది..పొలిటికల్ ట్రిప్‌లో అనూహ్యంగా తారక్‌తో భేటీ కావడమే కాకుండా.. ఈ అంశంపై అక్షర తెలుగులో అమిత్ షా ట్వీట్ చేయడం వెనుక ఏదో సస్పెన్స్ స్క్రీన్ ప్లే ఉందని చెప్పకనే చెప్తోంది. మరి బీజేపీ ఏం ఆఫర్ చేసింది.. దానికి ఎన్టీఆర్ ఏం రిప్లై ఇచ్చారు. మున్ముందు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయం ఎలా ఉండబోతుందనేది ఆసక్తిని రేపుతోంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి