మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా నేరాలు కూడా మారుతున్నాయి. టెక్నాలజీని తమకు అనుగుణంగా మార్చుకుని నేరాలకు పాల్పడుతున్నారు కొందరు నేరస్థులు. బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టడం మొదలు వ్యక్తిగత ఫొటోలను దొంగలిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇందుకోసం రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాపట్ల పోలీసులు సైబర్ నేరస్థులు ఎంచుకున్న మరో కొత్త రకం మోసం గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు.
బ్లూటూత్ వాడే వారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు. బ్లూబగ్గింగ్ తో స్మార్ట్ ఫోన్ హ్యాకింగ్ జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పరిచయం లేని వ్యక్తుల బ్లూటూత్ పెయిరింగ్ రిక్వెస్ట్‌లకు స్పందించకపోవడం మంచిదని సూచిస్తున్నారు. బ్లూటూత్ తో ఫోన్ డేటా దొంగిలించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, బ్లూబగ్గింగ్ తరహాలో జరిగే సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడండని పిలుపునిచ్చారు.
బస్సుల్లో, రైల్వేస్టేషన్స్‌లో ప్రజలు ఎక్కువగా ఉండే చోట తెలియని వ్యక్తి నుంచి బ్లూటూత్ రిక్వెస్ట్‌ను పంపిస్తారు. 10 మీటర్ల రేంజ్ నుంచి ఈ రిక్వెస్ట్ వస్తుంది. ఒకవేళ పొరపాటున ఆ లింక్ క్లిక్ చేశారో మీ ఫోన్లోని కాంటాక్ట్స్, ఫొటోలతో పాటు డేటా మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు తస్కరిస్తారు. దీంతో మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి బ్లాక్ మెయిల్‌కు దిగే అవకాశాలు ఉంటాయి. అదే విధంగా కాంటాక్ట్ నెంబర్లను కూడా దొంగలిస్తారు.
బ్లూబగ్గింగ్ బారిన పడకూడదనుకుంటే కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. అవేంటంటే..
* వీలైనంత వరకు పబ్లిక్ ప్లేస్‌ల్లో బ్లూటూత్ ఆఫ్ చేయడానికి ప్రయత్నించాలి.
* మీకు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే బ్లూటూత్ పేయిరింగ్ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయకూడదు.
* ఇప్పటికే మొబైల్‌లో అవసరం లేని బ్లూటూత్ డివైజ్‌లు ఏవైనా కనెక్ట్ అయ్యి ఉంటే వెంటనే అన్‌పెయిర్ చేయాలి.
* సైబర్ నేరాల బారిన పడితే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ https://cybercrime.gov.in/లో ఫిర్యాదు చేయాలి.
* సైబర్ నేరస్థుల వలలో చిక్కుకొని డబ్బులు కోల్పోతే వెంటనే 1930 హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..