Andhra Pradesh: కమిషన్ వస్తుందని ఆశ పడ్డారో అంతే సంగతులు.. కేటుగాళ్ల నయా చీటింగ్..!

|

Feb 12, 2023 | 9:14 PM

సైబర్ నేరగాళ్లు రోజుకో స్టైల్లో జనాలను ముంచేస్తున్నారు. మాటల్లో పెట్టి మాయ చేసి.. ఆశ చూపి ట్రాప్ చేస్తున్నారు. తాజాగా టాస్క్ గేమ్ పేరుతో కమిషన్ ఆశ చూపి నిలువునా ముంచేస్తున్నారు కేటుగాళ్లు. తొలుత ఊరించి..

Andhra Pradesh: కమిషన్ వస్తుందని ఆశ పడ్డారో అంతే సంగతులు.. కేటుగాళ్ల నయా చీటింగ్..!
Follow us on

సైబర్ నేరగాళ్లు రోజుకో స్టైల్లో జనాలను ముంచేస్తున్నారు. మాటల్లో పెట్టి మాయ చేసి.. ఆశ చూపి ట్రాప్ చేస్తున్నారు. తాజాగా టాస్క్ గేమ్ పేరుతో కమిషన్ ఆశ చూపి నిలువునా ముంచేస్తున్నారు కేటుగాళ్లు. తొలుత ఊరించి.. ట్రాప్‌లోకి వచ్చాక అంతా లాగేస్తున్నారు. ఎవరో నిరక్షరాస్యులు అయితే ఏమో అనుకోవచ్చు కానీ, కేటుగాళ్ల క్రిమినల్ మైండ్ ముందు మాస్టర్ మైండ్ లు కూడా డబ్బులు పోగొట్టుకొని తలలు పెట్టుకుంటున్నారు. ఈ తరహా మోసాలు విశాఖలో పెరుగుతూ వస్తున్నాయి. బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్, ఇంజనీర్లు కూడా ఉండడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.

పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి జనాలు నిండా మునిగిపోతున్నారు. రోజుకో స్టైల్‌లో పంధాను మార్చుకుంటూ నిలవు దోపిడీ చేసేస్తున్నారు. రోజుకో కొత్త పంథా ఎంచుకుంటూ సైబర్ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. వాట్సప్‌లో సందేశం పంపిస్తారు, టాస్కులు ఇస్తారు, డబ్బులు కొల్లగొడతున్నారు. ఇక మోసపోతున్న వారిలో ఎక్కువగా చదువుకున్నవారే ఉండడం విశేషం. విశాఖ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. వీటిలో ఎక్కువగా విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్, ప్రభుత్వ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. విశాఖ పరిధిలో వెలుగు చూసిన పలు సైబర్ క్రైమ్ కేసుల వివరాలు ఇవి..

ఇవి కూడా చదవండి

సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ఎర..

తగరపువలస ప్రాంతానికి చెందిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ IBM లో పనిచేస్తున్నారు. వాట్సాప్ నెంబర్ 8979013691 నుండి వారు GAC కంపెనీ రిసెప్షనిస్ట్ గా పరిచయం చేసుకుని, మీ ఇంటి వద్ద నుండి పార్ట్ టైం జాబ్ చేసుకుని డబ్బు సంపాదించుకోండి అని మెసేజ్ పెట్టారు. ఆమె ఆ మెసేజ్ చూసి నిజం అనుకొని వారితో చాటింగ్ చేయడం మొదలుపెట్టారు. youtube లో వీడియోస్ లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ చేయమని నమ్మించటం కోసం 100 రూపాయలు తొలుత అకౌంట్‌లో జమ చేశారు. నిజం అనుకొని వారితో టాస్క్ కంప్లీట్ చేయడం మొదలుపెట్టారు. ఇలా సైబర్ నేరగాళ్ళు వివిధ టాస్క్ పేరు మీదగా మొత్తం సుమారుగా 8.82 లక్షలు కొల్లగొట్టారు. ఇంకా డబ్బులు పంపించండి మీ టాస్క్ పూర్తి అవుతుంది అని చెప్పటంతో బాధితరాలు మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మోసపోయిన మాజీ సైనిక ఉద్యోగి..

విశాఖకు చెందిన మాజీ సైనిక ఉద్యోగి వాట్సాప్‌లో ఓ మెసేజ్ వచ్చింది. అతనికి రోజూ ఇంటి దగ్గర నుంచి 850 రూపాయల నుంచి 4 వేల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉందంటూ మెసేజ్ లో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో మూవీ టికెట్స్ రేటింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి టాస్క్ ఇస్తూ తొలుత రూ. 100, రూ. 200 జమ చేయించుకున్నారు కేటుగాళ్లు. ఇలా టాస్క్‌ల పేరుతో అందినకాడికి గుంజేశారు. బాధితుని వద్ద నుంచి రూ. 4.19 లక్షలు లాగేశారు. చివరకు తాను మోసపోయినట్టు గుర్తించి సైబర్ పోలీసులను ఆశ్రయించారు.

మరో మోసం..!

కంచరపాలెం కి చెందిన ప్రైవేట్ ఉద్యోగికి వాట్సాప్‌లో ఓ మెసేజ్ వచ్చింది. అందులో ఉన్న సారాంశం కూడా అదే. టాస్క్ కంప్లీట్ చేస్తే కమిషన్ మీ సొంతమంటూ ఎర వేశారు. రోజు ఇంటి దగ్గర నుంచి పని చేసి 300 రూపాయల నుంచి 1500 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉందంటూ మెసేజ్ లో ఉంది. ఆన్‌లైన్‌లో మూవీ ప్రొడక్ట్స్ రేటింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి టాస్క్‌లు, పెయిడ్ అని చెప్తూ, రిఫండ్ చేస్తామని చెప్పి నమ్మించారు. చివరకు రూ. 2.24 లక్షలు లాగేశారు.

గూగుల్ మ్యాప్స్ రేటింగ్ కోసమని..

గాజువాక కి చెందిన ఫార్మా కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ గా పని చేస్తున్న ఉద్యోగినికి ఇలాగే ట్రాప్ చేశారు. గూగుల్ మ్యాప్స్ కు రేటింగ్ ఇస్తే ఇంటి దగ్గర నుంచి రోజుకు రూ. 2,000 వరకు సంపాదించవచ్చునని చెప్పారు. ఒక్కో టాస్క్ కంప్లీట్ చేస్తే, రిఫండ్ చేస్తామని చెబుతూనే రూ. 2 లక్షల వరకు లాగేశారు.

ఇలా వాట్సాప్ లో వచ్చిన సందేశం ఏదైనా సైబర్ నేరగాళ్లు ఉద్దేశం ఒకటే. కేవలం ఈ ఏడాదిలోనే 13 కేసులు రిపోర్ట్ అయ్యాయి. సుమారుగా 44.94 లక్షల రూపాయలు బాధితులు మోసపోయారు. వారిలో ఆరుగురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఇద్దరు స్టూడెంట్స్, హౌస్ వైఫ్ ఒకరు, రిటైర్డ్ ఎంప్లాయ్ ఒకరు, ప్రైవేటు ఉద్యోగులు ముగ్గురు ఉన్నారు.

నేరాలు ఇలా..

సైబర్ నేరగాళ్ళు తమ టార్గెట్ సక్సెస్ చేసుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్ లలో అడ్వర్టైజ్‌మెంట్స్, మెసేజెస్ రూపంలో ప్రజలకు వల విసురుతూ ఉంటారు. మెసేజెస్ గాని యాడ్స్ గాని చూసి ఎవరైతే రెస్పాండ్ అవుతారో వారికి కమిషన్ ఆశ చూపిస్తూ కమిషన్ బేస్డ్ టాస్క్ గేమ్స్ క్రింద వారిని రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి నమ్మిస్తారు. ఫేక్ వెబ్‌సైట్ డిజైన్ చేసి, బాధితుడుని నమ్మిస్తారు.

మొదటగా youtube లో వీడియోస్‌కి లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ చేయమని చెప్తారు. అలా చేసినందుకు గాను ప్రతి లైక్ కి కొంత మొత్తం (ఉదా.. రూ. 100 లకు రూ. 130 పంపిస్తారు) చొప్పున అకౌంట్లో జమ చేస్తారు. అలా మొదటి రోజు బాధితునికి సుమారుగా 4 వీడియోస్ లైక్ చేయమని చెప్పి, లైక్ చేసినందుకు గాను బాధితుడికి సుమారు రూ. 400 అకౌంట్లో జమ చేశారు. 5 వ టాస్క్ కోసం అని చెప్పి వేరొక సోషల్ మీడియా టెలిగ్రాం యాప్‌కి రీడైరెక్ట్ చేసి గైడెన్స్ కోసం ఒక ట్యూటర్‌ని ఇస్తున్నట్లు చెప్పి నమ్మిస్తారు. మొదట టాస్క్ 54,000 రూపాయలు పెట్టి కొనాలి. అందుకుగాను 30శాతం కమీషన్‌తో కలిపి 70,200 రూపాయలు వస్తుందని చెప్తారు. అది నిజమని నమ్మిన బాధితురాలు.. టాస్క్ 5 4,000 రూపాయలు కొని వారు చూపించిన వెల్ఫేర్ టాస్క్ బటన్ కొట్టగా, కమిషన్ తో కలిపి 70,200 రూపాయలు వచ్చాయి. అయితే, అవి విత్ డ్రా చేసుకోవడానికి మరో లింక్ పెట్టారు. డబ్బులు విత్ డ్రా చేయాలంటే మరికొన్ని టాస్కులని కచ్చితంగా పూర్తి చేయాలని సైబర్ నేరగాళ్లు సూచించగా బాధితురాలు నమ్మేసింది. ఇలా మొత్తంగా సుమారు రూ. 8,82,000 కొల్లగొట్టారు. డబ్బులు విత్ డ్రా చేసుకోవాలనుకుంటే ఇంకొంత మొత్తం చెల్లించమనగా మోసపోయినట్లు గుర్తించిన బాధితులు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సైబర్ క్రైమ్ అవేర్నెస్..

ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పార్ట్ టైం జాబ్స్ పేరు మీద సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను, ముఖ్యంగా నిరుద్యోగ యువత, ప్రైవేటు ఉద్యోగులు, గృహిణులే కాకుండా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు లక్ష్యంగా పెట్టుకొని ఎక్కువ మొత్తం కమిషన్ ఆశ చూపించి లక్షల రూపాయలను కొల్లగొడుతున్నారు. ఆన్‌లైన్‌లో, సోషల్ మీడియాలో వస్తున్న ఈ పార్ట్ టైమ్ జాబ్ మెసేజ్‌లను నమ్మవద్దని, నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచిస్తున్నారు పోలీసులు. ఎవరికైనా అనుమానాస్పద మెసేజ్‌లు వస్తే వెంటనే www.cybercrime.gov.in, లేదా టోల్ ఫ్రీ నెంబర్: 1930 లేదా ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్: 9490617917 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

అవగాహన కోసం విశాఖ సిటీ పోలీస్ షేర్ చేసిన వివరాలు మీకోసం..

ఒక్క రూపాయి కూడా చాలా విలువైనది. కష్టపడి సంపాదిస్తేనే దాని విలువ తెలుస్తుంది. అటువంటి విలువైన సొత్తు కమిషన్ కోసం ఆశపడి నేరగాళ్ల ట్యాబ్లో చిక్కుకొని కోల్పోవద్దు. బి అలర్ట్.

– ఖాజా, టీవీ9 తెలుగు ప్రతినిధి, వైజాగ్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..