B.Pharmacy student murder: బీ ఫార్మసీ విద్యార్థిని మృతిపై కీలక వివరాలు వెల్లడించిన డీఎస్పీ.. నిందితుడి అరెస్ట్..!

|

May 09, 2022 | 6:20 PM

B.Pharmacy student murder: సత్యసాయి జిల్లా గోరంట్లలో జరిగిన బీ ఫార్మసీ విద్యార్థిని ఘటనపై బిజెపి నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు.

B.Pharmacy student murder: బీ ఫార్మసీ విద్యార్థిని మృతిపై కీలక వివరాలు వెల్లడించిన డీఎస్పీ.. నిందితుడి అరెస్ట్..!
Dsp
Follow us on

B.Pharmacy student murder: సత్యసాయి జిల్లా గోరంట్లలో జరిగిన బీ ఫార్మసీ విద్యార్థిని ఘటనపై బిజెపి నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి.. ఇవాళ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత హత్య జరిగిన స్థలాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థిని మృతదేహానికి అంత హడావిడిగా పోస్టుమార్టం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. విద్యార్థిని శరీరంపై గాయాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు ఇది హత్య అని చెబుతుంటే పోలీసులు ఎందుకు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని నిలదీశారు. దీని వెనుక వైసిపి నాయకులు ఒత్తిడి ఉందని ఆరోపించారు. వెంటనే ఇక్కడ ఉన్న పోలీసులు అందరినీ బదిలీ చేసి కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారాయన.

ఇదిలాఉంటే.. సత్య సాయి జిల్లా పుట్టపర్తిలోని జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నాయకులు జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. బీ ఫార్మసీ విద్యార్థిని మృతి ఘటనపై పెద్ద ఎత్తు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని తల్లిదండ్రులతో కలిసి ఎస్పీ కార్యాలయం వద్ద బైఠాయించారు. ఈ కేసులో నిందితుడు సాధిక్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు విషయంలో వైసీపీ నాయకుల ఒత్తిడి ఉందని ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక గోరంట్ల బీ ఫార్మసీ విద్యార్థిని ఘటనలో నిందితుడు సాధిక్‌ను అరెస్ట్ చేసినట్లు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్, దిశ డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. నిందితుడిపై 420, 376, 306 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు. తేజస్వినికి నిందితుడు సాదిక్‌తో 3 సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని వెల్లడించారు పోలీసులు. ఈ క్రమంలోనే 4వ తేదీన తిరుపతి నుంచి వచ్చి సాదిక్‌ను కలిసిందన్నారు. తేజస్విని షెడ్డులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు. ప్రేమ పేరుతో వంచన చేసి ఆత్మహత్యకు ప్రేరేపించిన విధంగా కేసులు నమోదు చేశామని డీఎస్పీ వెల్లడించారు. ప్రస్తుతం దిశ విభాగంలో విచారణ జరుగుతోందన్నారు.