Pileru politics: చిత్తూరు జిల్లాలో రూ.400 కోట్ల భూ కుంభకోణం.. వైసీపీ నేతలపై నల్లారి కిశోర్ సంచలన ఆరోపణలు..!

|

Jul 05, 2021 | 1:12 PM

చిత్తూరు జిల్లాలో రాజకీయంగా బద్ద శత్రుత్వం ఉన్న పెద్దిరెడ్డి - నల్లారి కుటుంబాల మధ్య ఇప్పుడు కుంభకోణాల వ్యవహారంపై పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి.

Pileru politics: చిత్తూరు జిల్లాలో రూ.400 కోట్ల భూ కుంభకోణం.. వైసీపీ నేతలపై నల్లారి కిశోర్ సంచలన ఆరోపణలు..!
Tdp Vs Ysrcp
Follow us on

Pileru political heat Nallari vs Peddireddy : చిత్తూరు జిల్లాలో రాజకీయంగా బద్ద శత్రుత్వం ఉన్న పెద్దిరెడ్డి – నల్లారి కుటుంబాల మధ్య ఇప్పుడు కుంభకోణాల వ్యవహారంపై పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి భూ కుంభకోణ ఆరోపణలు కారణమయ్యాయి. పీలేరులో అక్రమాలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అండదండలు ఉన్నాయంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆరోపణలు తీవ్ర దుమారాన్ని లేపాయి. రూ.400 కోట్ల రూపాయల విలువైన భూములు ఆక్రమణలకు గురయ్యాయంటూ రెండు రోజుల క్రితం సాక్షాలతో మీడియా ముందుకు వచ్చిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

చిత్తూరు జిల్లా పీలేరు పరిసరాల్లోని విలువైన భూములను అధికార పార్టీ నేతుల కాజేశారని నల్లారి కిశోర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్, చెన్నై, తిరుపతి, మదనపల్లి జాతీయ రహదారికి పక్కనే దొడ్డిపల్లి, ఎర్రగుంటపల్లి, బోడుమల్లువారిపల్లె, గూడ రేవుపల్లి, ముడుపుల వేముల గ్రామాల్లో భూ ఆక్రమణలు జరిగాయని ఆయన మండిపడ్డారు. ఎకరం 5 కోట్ల రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూములు కబ్జా చేశారని ఆరోపించారు. డికేటి, చుక్కల భూములతో పాటు స్మశాన స్థలాలు, ఆర్ అండ్ బీ కి చెందిన ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువులను కూడా కబ్జా చేశారంటూ విరుచుకుపడ్డారు. ఇందుకు సంబంధించిన సర్వే నంబర్లు, అక్రమ లేఅవుట్లు, ఫోటోలతో కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినా అధికారులు ఒత్తిళ్లకు గురై ఆక్రమణలకు సహకరించారని ఆరోపించారు. టీడీపీ హయాంలోనే కాకుండా 20 ఏళ్లుగా తమ కుటుంబం అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ భూముల వద్ద బోర్డులు పెట్టి కాపాడితే వైసీపీ నేతలు కబ్జాలతో కాజేస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు నల్లారి కిషోర్. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన కలెక్టర్, సబ్ కలెక్టర్ లకు వాస్తవాలు తెలిసినా భూ కబ్జాదారుల పై క్రిమినల్ కేసులు నమోదు చేయడం లేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే న్యాయ విచారణ చేపట్టాలన్న కిషోర్ కుమార్ రెడ్డి, పీలేరులో వైసీపీ నేతల అక్రమాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.

ఇక, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి లపై నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలపై వైసీపీ కౌంటర్ అటాక్ ఇచ్చింది. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సవాల్ విసరడంతో పీలేరులో పొలిటికల్ హీట్ నెలకొంది. 400 కోట్ల రూపాయల భూ అక్రమాలకు పాల్పడ్డారని కిషోర్ చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఖండించారు. పెద్దిరెడ్డి కుటుంబం రాజకీయంగా ఎదగడం, నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేయడాన్ని చూసి ఓర్వలేకనే పెద్దిరెడ్డి కుటుంబంపై నల్లారి కుటుంబం తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు.

అన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ్ముడు కిషోర్ ఎలా అక్రమంగా సంపాదించి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను కూడబెట్టారన్న విషయం అందరికీ తెలిసిందేనని ఆయన దుయ్యబట్టారు. పీలేరు నియోజకవర్గంలో 2009 నుంచి 2014 వరకు జరిగిన అభివృద్ధి చాటున జరిగిన అవినీతిపై, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండేళ్లలో జరిగిన అభివృద్ధిపై విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే చింతల డిమాండ్ చేశారు. పీలేరు అవినీతిపై నల్లారి ఆరోపణలు వైసీపీ ఎమ్మెల్యే చింతల కౌంటర్ అటాక్ తో ఇప్పుడు పీలేరులో భూ ఆక్రమణల పై వస్తున్న ఆరోపణలవ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

—- ఎంపీఆర్ రాజు, టీవీ 9 ప్రతినిధి, తిరుపతి.