YS Jagan Mohan Reddy: రాజకీయాల్లో సెన్సెషన్.. పాలనలో మార్క్.. ఏపీ సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆసక్తికర విషయాలు..

|

Dec 21, 2022 | 9:08 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయాలలోకి వచ్చిన జగన్ .. సొంత పార్టీ ప్రకటన నాటి నుంచి ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని ఒక్కడిగా నిలబడ్డారు. ‘ప్రజా సంకల్ప యాత్ర’తో  విభాజిత ఆంధ్రాప్రజలతో..

YS Jagan Mohan Reddy: రాజకీయాల్లో సెన్సెషన్.. పాలనలో మార్క్.. ఏపీ సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆసక్తికర విషయాలు..
AP Cm Ys Jagan Mohan Reddy
Follow us on

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయాలలోకి వచ్చిన జగన్ .. సొంత పార్టీ ప్రకటన నాటి నుంచి ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని ఒక్కడిగా నిలబడ్డారు. ‘ప్రజా సంకల్ప యాత్ర’తో  విభాజిత ఆంధ్రాప్రజలతో మమేకమవుతూ.. తనని తానే ఓ ‘లీడర్’గా ఆవిష్కరించుకున్నారు జగన్. నవ్యాంధ్రకు రెండో ముఖ్యమంత్రి, ఇంకా దేశంలోనే అత్యంత పిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తన 50వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ‘ఒక్క అవకాశం’ అంటూ రాజకీయ రణరంగంలోకి దిగి, 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తన ‘ఫ్యాన్’ గాలితో సునామీ సృష్టించిన జగన్.. నవ్యాంధ్రుల మనసు గెలుచుకున్నారు.

వైయస్ వారసుడిగా  రాజకీయ ఆరంగేట్రం..

మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి, విజయమ్మలకు పులివెందులలో జన్మించిన వైఎస్ జగన్మోహన్​రెడ్డి.. 2004లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థిగా నిలబడి విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా కాంగ్రెస్ పార్టీలోనూ ఓ వెలుగు వెలిగారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి అధికారం చేపట్టిన కొన్ని రోజులకే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అనంతరం రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్​ పార్టీ నుంచి జగన్ బయటికొచ్చారు. తండ్రి మరణవార్తతో గుండెపగిలిన కుటుంబాలకు భరోసానిస్తూ..ఓదార్పు యాత్ర చేపట్టారు. కాంగ్రెస్ అధిష్ఠానం అడ్డు చెప్పినా వెనుకడుగు వేయకుండా ప్రజల చెంతకు వెళ్లారు. అక్కడి నుంచే ఆయన్ను సమస్యలు చుట్టుముట్టాయి. తన తండ్రి అధికారంలో ఉన్న కాలంలో వైఎస్ జగన్ అక్రమాస్తులు కూడగట్టారనే ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ ఛార్జిషీట్లు వేశాయి. ఈ ఆరోపణలతో ఆయన 16 నెలల పాటు జైలు జీవితాన్నికూడా గడిపారు.

ఇవి కూడా చదవండి

ఉపఎన్నికల్లో భారీ మెజార్టీ..

కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికొచ్చిన జగన్..తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఉపఎన్నికలకు వెళ్లిన ఆయన.. 5 లక్షలపైగా ఆధిక్యంతో గెలిచి దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన వారిలో ఒకరిగా నిలిచారు జగన్. ఆ సమయంలోనే తల్లి వైఎస్ విజయమ్మ పులివెందుల ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచారు. అధిష్ఠానం ఓదార్పు యాత్ర వద్దన్నదని అసంతృప్తితో బయటకొచ్చిన జగన్​ 2011లో వైఎస్సార్​సీపీని ప్రకటించారు. ఆయన వెంటే 18 మంది ఎమ్మెల్యేలూ తమ పదవులకు రాజీనామా చేసి జగన్​తో నడిచారు. 2012 ఉపఎన్నికలకు వెళ్లి ఫ్యాన్ పార్టీ గుర్తుపై పోటీ చేసిన 15 మంది అఖంఢ మెజార్టీతో విజయ దుందుభి మోగించారు.

2014 అసెంబ్లీ ఎన్నికలలో కనబర్చిన సత్తా

అనంతరం బలపడుతున్న సమయంలోనే రాష్ట్రవిభజన సంక్షోభంలో చిక్కుకుంది వైసీపీ. ఈ సమయంలో సమైక్యాంధ్రకు జై కొట్టిన జగన్​.. తెలంగాణ నేతల ఆగ్రహానికి గురయ్యారు. కుడి భుజం అనుకున్న నేతలనూ ఈ సందర్భంగా జగన్ కోల్పోయారు. అయినా ఎక్కడా వెనక్కి తగ్గని జగన్​.. పార్టీని ముందుకు తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన తర్వాత చాలామంది కాంగ్రెస్​ పార్టీని వీడి జగన్​తో జతకట్టారు. 2014 ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేసిన వైసీపీ ఆంధ్రప్రదేశ్​లో విజయానికి 1 శాతం ఓట్ల దూరంలో ఉండిపోయింది. తెలంగాణ రెండు అసెంబ్లీ సీట్లు, ఒక పార్లమెంట్​ స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది. అనుభవలేమి కారణంగా ఆ ఎన్నికల్లో నవ్యాంధ్ర ప్రజలు జగన్​ను తిరస్కరించారు. అయినా ఆ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమికి గట్టి పోటీనిచ్చి 67 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది.

అన్నీ తానై సాధించుకున్న ఘన విజయం

అధికారానికి దూరమైన వైసీపీ..ఆ తర్వాత అనేక అటుపోటులను ఎదుర్కొంది. ఆ పార్టీ గుర్తుపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడటం.. వెంటాడుతున్న అవినీతి ఆరోపణలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రత్యర్థుల ఆరోపణలు పట్టించుకోకుండా రాజకీయ సలహాదారు ప్రశాంత్​ కిశోర్ సలహాలతో వ్యూహాలు మార్చుకుంటూ వచ్చారు. పార్టీ నేతల లోపాలే కాదు.. తనలోని బలహీనతలను అధిగమించారు. అసెంబ్లీ నుంచి పారిపోయారన్న అపవాదును తిప్పికొట్టేలా.. దీక్షలు, సభలు, యాత్రల పేరుతో ప్రజల్లోనే ఉండేలా జాగ్రత్త పడ్డారు. రైతు భేరి, జలభేరి, ఫీజు రియంబర్స్​మెంట్ దీక్షలతో కేడర్​లో ఉత్సాహం నింపారు. పార్టీ ఎంపీలతో అవిశ్వాసం పెట్టించడం.. రాజీనామా చేయించి వార్తల్లో నిలిచారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తూనే.. తాను వస్తే ఏం చేస్తానో నవరత్నాలపేరుతో సూటిగా చెప్పగలిగారు. ప్రజాసంకల్ప యాత్రలోనూ దీన్నే ప్రచారనినాదంగా మలుచుకున్నారు. ఆది నుంచి పోరాట పంథానే గెలుపునకు రహదారిగా మలుచుకుంటూ వస్తున్న జగన్.. 2109 ఎన్నికల్లో ఒక్క అవకాశం అంటూ నవ్యాంధ్ర ఓటర్ల మనసుల్లో స్థానం సంపాదించారు. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించి తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

పాలన విధివిధానాలు

అధికారంలోకి వచ్చిన జగన్.. సంక్షేమ జపాన్ని ఎత్తుకున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పంపేలా పలు పథకాలకు పురుడు పోశారు. ఇదే సమయంలో ఏపీ రాజధాని విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానుల ఫార్ములాతో ముందుకెళ్లినప్పటికీ… అనుకున్న విధంగా ప్లాన్ వర్కౌట్ కాలేదు. కోర్టు కేసుల నేపథ్యంలో వెనక్కి తగ్గారు. సంబంధిత బిల్లును కూడా రద్దు చేశారు. ఇదే సమయంలో త్వరలోనే విశాఖ వేదికగా పాలనకు సిద్ధమయ్యే పనిలో పడ్డారు. మరోవైపు వచ్చే ఎన్నికలకు ఇప్పుడే వ్యూహాలు రచిస్తున్నారు. వై నాట్ 175 అంటూ నియోజకవర్గాల నేతలతో భేటీ అవుతున్నారు. రెండోసారి అధికారంలోకి రావటమే లక్ష్యమని తేల్చి చెబుతున్నారు. మరోవైపు జగన్ పాలనలో ఏపీ అభివృద్ధి పూర్తిగా నశించిందని, రాజధాని ఊసే లేదంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు కూడా గుప్పిస్తున్నాయి. అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తూ ముందుకెళ్తున్నారు జగన్.

ప్రారంభమైన పుట్టిన రోజు వేడుకలు..

ఇక నేడు ఆయన 50వ సంవత్సరంలోకి అడుగులు వేయడంతో.. వైసీపీ కార్యకర్తలలో, రాష్ట్ర ప్రజలలో పండగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్ అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా అనేక సేవాకార్యక్రమాలను చేపడుతున్నారు. విదేశాల్లో ఉన్న జగన్ అభిమానులు కూడా… హ్యాపీ బర్త్ డే జగనన్న అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ‘జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు’ పేరుతో గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జిల్లాల వారిగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ సెలబ్రేషన్స్‌ను మంత్రి రోజా స్వయంగా దగ్గరుండి మరీ నిర్వహిస్తున్నారు. వివిధ కళారూపాల ప్రదర్శనలతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేస్తున్నారు. దీని కోసం రెండు కోట్ల రూపాయలను కేటాయించారు కూడా.

సైకత శిల్పంతో శుభాకాంక్షలు తెలిపిన తూర్పుగోదావరి జిల్లా వాసి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఏర్పాటు చేసిన సైకతశిల్పం నెటిజన్లను అబ్బురపరుస్తోంది. వైయస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు ఆధ్వర్యంలో ఒరిస్సా సైకత శిల్పులు చెక్కిన భారీ ఇసుక చిత్రం అందర్నీ ఆకర్షిస్తోంది. ‘ఆంధ్రప్రదేశ్ రేఖా చిత్రం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శిల్పం, హార్ట్ బీట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు, జై జగన్’ వంటి పేర్లతో.. పైన చుట్టూ ఆర్చి పై నవరత్నాల పేర్లను అత్యంత శోభాయమానంగా, కళాత్మకత ఉట్టిపడేటట్టు చెక్కిన ఈ సైకత శిల్పం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆరు లారీల ఇసుకతో 25 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తుతో ఒరిస్సా కళాకారులు దశరథ్ మహంతో బాబుల్ ఈ కళాఖండాన్ని కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బహు సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి జగనన్నపై గిరిజాల తనకున్న అభిమానాన్ని పుట్టినరోజు వేళ వినూత్న తరహాలో చాటి చెప్పటం హైలెట్‌గా నిలుస్తోంది. గత ఎనిమిదేళ్లగా సీఎం జగన్ ప్రతి పుట్టినరోజును వైవిద్య భరితంగా ప్రత్యేకతను సంతరించుకునేటట్లు గిరిజాల బాబు ఆనవాయితీగా జరపడం ఓ విశేషం.

మరిన్ని ఏపీ వార్తల కోసం..