Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో అవ్వ-తాతలను పెన్షన్‌ టెన్షన్‌

|

May 02, 2024 | 10:29 PM

ఏపీలో పెన్షన్‌ పరేషాన్ కంటిన్యూ అవుతోంది. గత నెలలో సచివాలయాల దగ్గర పడిగాపులు పడిన వృద్ధులు.. ఇప్పుడు బ్యాంకుల దగ్గర క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ప్లేస్‌ మారింది తప్పా... అదే క్యూ, అవే ఇబ్బందులు ఎదుర్కొన్నారు లబ్దిదారులు.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో అవ్వ-తాతలను పెన్షన్‌ టెన్షన్‌
Andhra Pensions
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో అవ్వ-తాతలను పెన్షన్‌ టెన్షన్‌ పెడుతోంది. గత నెల ఇబ్బందుల దృష్ట్యా ఈసారి సిస్టమ్‌ మార్చినప్పటికీ… కష్టం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. బ్యాంక్‌ అకౌంట్లకు పెన్షన్లు జమ చేయడంతో లబ్దిదారుల ఇబ్బందులు రెట్టింపయ్యాయి. ఇటు బ్యాంకుకు అటు సచివాలయానికి కాళ్లీడ్చుకుంటూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈసారి పెన్షన్‌ డీబీటీ ద్వారా బ్యాంక్‌ అకౌంట్స్‌కి క్రెడిట్‌ అయ్యింది. అయితే బ్యాంక్‌ అకౌంట్స్‌ గురించి సరైన అవగాహన లేని వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు, మూడు బ్యాంక్‌ అకౌంట్స్‌ ఉన్న వారు ఏ అకౌంట్‌లో పెన్షన్‌ పడిందో తెలియక తలలు పట్టుకున్నారు. మరికొందరు ఇదే అకౌంట్‌ లింక్‌ చేశాం.. అయినా పెన్షన్‌ పడలేదంటూ అటు బ్యాంక్‌కు ఇటు సచివాలయానికి కాళ్లీడ్చుకుంటూ ఎండలో తిరిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకులకు వెళ్లిన అలవాటు లేకపోవడం…ఏటీఎం కార్డుల వాడకం తెలియకపోవడంతో అవ్వతాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అలాగే… గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంకు ఖాతాలను వాడని వారికీ తిప్పలు తప్పలేదు. బ్యాంకు లావాదేవీలు లేకపోవడంతో ఎకౌంట్లు డీఆక్టివేట్ లేదా ఫ్రీజ్ మోడ్‌లోకి వెళ్లినట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులు చూపించి, మళ్లీ అకౌంటును యాక్టివేట్ చేసుకోవచ్చని చెబుతున్నారు. దీంతో తమ అకౌంట్లను యాక్టివేట్ చేయించుకునేందుకు బ్యాంకులకు వృద్ధులు క్యూ కట్టారు. ఎండలోనే బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడ్డారు. గతంలో పెన్షన్లు ఇళ్లకు తెచ్చి ఇచ్చేవారని, ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుందంటూ ఆవేదన చెందారు లబ్దిదారులు.

ఇదిలా ఉండగా.. అన్నమయ్య జిల్లా రాయచోటిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెన్షన్‌ ఓ ప్రాణాన్ని తీసుకుంది. బ్యాంకుకు పెన్షన్‌ కోసం వెళ్లిన సుబ్బన్న అనే వృద్ధుడు, అక్కడికక్కడే కుప్పకూలిపోయి కన్నుమూయడం స్థానికంగా విషాదాన్ని నింపింది.

ఇక పెన్షన్‌ ఇబ్బందులపై పొలిటికల్‌గానూ రచ్చ కంటిన్యూ అవుతోంది. టీడీపీ టార్గెట్‌గా వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వల్లనే అవ్వతాతలకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే రోజా. అవ్వతాతల ఇబ్బందులు చూస్తుంటే ఎంతో బాధేస్తోందన్నారామె.  మొత్తంగా ఏపీలో చాలాచోట్ల పెన్షన్‌దారులకు ఈసారి కూడా తిప్పలు తప్పలేదు. బ్యాంక్‌ అకౌంట్లతో గందరగోళానికి గురయ్యారు. పెన్షన్‌ పడలేదంటూ కొందరూ… పెన్షన్‌ పడిన అకౌంట్‌ డీయాక్టివేట్‌ అయ్యిందంటూ మరికొందరు ఆందోళనకు గురయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…