పట్టపగలు ఆధార్ వెరిఫికేషన్ పేరిట ఇంట్లోకి దూరి ఘోరం.. భార్య మృతి, భర్త ఆస్పత్రిపాలు!

పెదకూరపాడులో వృద్ధ దంపతులపై దుండగులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఆధార్ కార్డు వెరిఫికేషన్ పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు యువకులు సుత్తితో దాడి చేసి, వృద్ధురాలిని హతమార్చారు. భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి, సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు..

పట్టపగలు ఆధార్ వెరిఫికేషన్ పేరిట ఇంట్లోకి దూరి ఘోరం.. భార్య మృతి, భర్త ఆస్పత్రిపాలు!
Pedakurapadu Murder Case

Edited By:

Updated on: Aug 06, 2026 | 5:44 PM

గుంటూరు, ఆగస్ట్ 6: పెదకూరపాడులో అత్యంత దారుణంగా వృద్ధ దంపతులుపై దాడి చేసి భార్యను హతమార్చడం కలకలం రేపింది. ప్రశాంతంగా ఉండే మండల కేంద్రంలో జరిగిన దారుణ హత్యతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పట్టపగలు ఆధార్ కార్డు వెరిఫికేషన్ అంటూ ఇంట్లోకి దూరి ఇద్దరిపై సుత్తితో దాడి చేయడమే కాకుండా వృద్ధురాలిని గొంతుకోసి హతమార్చిన ఘటనపై ప్రత్యేక బ్రుందాలను నియమించి పోలీసులు గాలింపు చేపట్టారు.

పెదకూరపాడులోని దామచర్లపాలెంలోని అవ్వారి బాలగురవయ్య, అరుణ దంపతుల ఇంటి ఉదయం పదకొండున్నర గంటల సమయంలో ఇద్దరు యువకులు వచ్చారు. బాలగురవయ్యను ఆధార్ కార్డు చూపించాలంటూ అడిగారు. అరుణ ఆధార్ కార్డు తీసుకువస్తానంటూ ఇంట్లోకి వెళ్లారు. అదే సమయంలో వచ్చిన యువకులు బాలగురవయ్యపై సుత్తితో దాడి చేశారు. బాల గురవయ్య కేకలు వేయడంతో పరిగెత్తుకుంటూ వచ్చిన అరుణ యువకులను అడ్డుకుంది. వెంటనే యువకులు అరుణ గొంతు కోశారు. ఆమె కేకలు వేసుకుంటూ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోయింది. అనంతరం అరుణ అక్కడికక్కడే చనిపోయింది. బాల గురవయ్య కేకలు వేయడంతో చుట్టు పక్కల వాళ్లు గుమిగూడారు. అప్పటికే వచ్చిన యువకులు అక్కడి నుండి పారిపోయారు. తీవ్ర గాయాలయిన బాల గురవయ్యను ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

ఆసుపత్రిలో తన భార్యకు ఏమైందంటూ బాల గురవయ్య వాకబు చేయడం పలువురిని కంటతడి పెట్టించింది. భార్య చనిపోయిన విషయాన్ని బాలగురవయ్యకు బంధువులు చెప్పలేదు. సత్తెనపల్లి డీఎస్పీ క్రిష్ణ చైతన్య సంఘటన స్థలాన్ని పరిశీలించి నిందుతులను పట్టుకునేందుకు ప్రత్యేక బ్రుందాలను ఏర్పాటు చేశారు. హత్యలు ఎందుకు చేశారు? అన్న కోణంలో దర్యాప్తు జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఈ దంపతులు భూములు అమ్మగా డబ్బులు వచ్చినట్లు గుర్తించారు. బంధువులే దాడి చేసి హత్య చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని డీఎస్పీ చెప్పారు. మండల కేంద్రంలోని అన్ని ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరా విజువల్స్ ను సేకరిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us