ఆ పేరు వెనుక ఉద్యమ స్ఫూర్తి.. జెన్ జీకి దగ్గరయ్యేందుకు జనసేన కీలక నిర్ణయం..
జనసేన పార్టీ తొలిసారిగా ప్రత్యేక యువజన విభాగాన్ని ఏర్పాటు చేసింది. ‘జై కొట్టు’ పేరుతో రూపొందించిన ఈ యూత్ వింగ్‌ను పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా పిఠాపురంలో ఆవిష్కరించారు. జెన్‌జీతో పాటు యువతను పార్టీ కార్యకలాపాలకు మరింత దగ్గర చేయడం, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం లక్ష్యంగా ఈ విభాగాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.

‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా..’..తెలుగు ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన గేయంలోని ఈ పిలుపు.. ఇప్పుడు జనసేన యువజన విభాగం పేరుగా మారింది. పార్టీ ఆవిర్భవించి పన్నెండేళ్లు దాటిన తర్వాత.. జనసేన తొలిసారిగా ప్రత్యేక యువజన విభాగాన్ని ఏర్పాటు చేసింది. ‘జై కొట్టు’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ విభాగాన్ని పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా బుధవారం పిఠాపురంలో ఆవిష్కరించారు. వాస్తవానికి.. 2014 మార్చి 14న జనసేన ఆవిర్భవించింది. పార్టీ ప్రస్థానంలో యువత మొదటి నుంచీ కీలకంగా ఉంది. సభలు, సమావేశాలు, ఉద్యమాలు, పార్టీ కార్యక్రమాల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటూ వచ్చింది. అయితే.. ప్రత్యేకంగా యువజన విభాగం మాత్రం ఇంతకాలం లేదు. వీర మహిళా విభాగం వంటి నిర్మాణాలతో పార్టీ కార్యకలాపాలు కొనసాగాయి. ఇప్పుడు ‘జై కొట్టు’ ఏర్పాటు చేయడం ద్వారా.. పార్టీతో ఉన్న యువతను ప్రత్యేకంగా జెన్‌జీని ఒక వేదికపైకి తీసుకురావడానికి జనసేన కీలక అడుగు వేసింది.
‘జై కొట్టు’.. ఆ పేరే ఎందుకు?
‘జై కొట్టు’ పేరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కారణం.. ఈ పదబంధం తెలుగు ప్రజలకు కొత్తది కాదు. ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తి గలవోడా’ అంటూ ప్రజల్లో చైతన్యం నింపిన గేయం గుర్తుకొస్తుంది. ఈ గేయాన్ని వేములపల్లి శ్రీకృష్ణ రచించారు. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ కాలంలో ఈ పాట ప్రజల్లో స్ఫూర్తిని నింపింది. ఆ తర్వాత కూడా ‘జైకొట్టు’ అన్న పదం ప్రజా చైతన్యం, ఉద్యమ స్ఫూర్తితో ముడిపడి కనిపించింది.
జనసేన.. తన యువజన విభాగానికి
‘జై కొట్టు’ అని పేరు పెట్టుకోవడం వెనుక అదే స్ఫూర్తి ఉందా? అన్న చర్చ సహజంగానే మొదలైంది. అయితే.. ఈ పేరును ఆ గేయం నుంచే తీసుకున్నట్లు పార్టీ అధికారికంగా వెల్లడించలేదు. అయినా.. ప్రజలను సమీకరించే పిలుపు, చైతన్యం, కార్యాచరణకు ప్రేరణ కలిగించే భావం మాత్రం ఈ పేరులో కనిపిస్తోంది. ఉద్యమ నేపథ్యం నుంచి రాజకీయ వేదికపైకి.. జనసేన ఆవిర్భావం వెనుక కూడా ఒక ఉద్యమ నేపథ్యం ఉంది.
ప్రజా సమస్యలపై స్పందించడం, వ్యవస్థలో మార్పు రావాలన్న ఆకాంక్షతో పార్టీ రాజకీయాల్లోకి వచ్చింది. పవన్ కల్యాణ్ కూడా తన రాజకీయ ప్రసంగాల్లో యువతను మార్పుకు ప్రతినిధులుగా ప్రస్తావిస్తూ వచ్చారు. వివిధ సందర్భాల్లో విప్లవ భావజాలం, చేగువేరా వంటి వ్యక్తుల స్ఫూర్తిని ప్రస్తావించిన ఆయన.. మరోవైపు భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం వంటి అంశాలపై కూడా తన అభిప్రాయాలను బలంగా వినిపించారు. ఈ భిన్నమైన ఆలోచనా నేపథ్యాల మధ్య.. యువతను రాజకీయంగా, సామాజికంగా చైతన్యవంతం చేసే వేదికగా ‘జై కొట్టు’ను తీర్చిదిద్దాలన్న ఆలోచన కనిపిస్తోంది.
పార్టీకి యువశక్తిని మరింత దగ్గర చేసేలా..
రాజకీయాల్లో యువత పాత్ర రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల కాలంలో యువతే రాజకీయ పార్టీలకు ప్రధాన బలంగా మారుతోంది. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించడం నుంచి.. వాటిపై స్పందించడం వరకు యువత ముందుంటోంది. ఈ నేపథ్యంలో జనసేన కూడా ఇప్పటివరకు వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న యువతకు ఒక ప్రత్యేక సంస్థాగత రూపం ఇవ్వాలని నిర్ణయించినట్టు కనిపిస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడంతో పాటు.. సేవా కార్యక్రమాలు, సామాజిక సమస్యలపై స్పందన, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అంశాల్లో ‘జై కొట్టు’ను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.
పిఠాపురం నుంచి ‘జై కొట్టు’కు శ్రీకారం
పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా పిఠాపురంలో ‘జై కొట్టు’ లోగోను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. యువజన విభాగం ఏర్పాటు సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆడియో సందేశం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల స్థాయిలో యువతను ఈ విభాగంతో అనుసంధానించేలా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నేతలు చెబుతున్నారు.
పేరు ఆసక్తికరం..
పన్నెండేళ్ల తర్వాత జనసేన ఏర్పాటు చేసిన యువజన విభాగానికి ‘జై కొట్టు’ అనే పేరు పెట్టడం ఒక ఆసక్తికరమైన పరిణామం. ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసే పేరు.. యువతను కార్యాచరణ వైపు నడిపించే లక్ష్యం. మరి ఈ పేరుకు తగ్గట్టుగా ‘జై కొట్టు’ ఎంత బలమైన యువజన విభాగంగా ఎదుగుతుంది? పార్టీ కార్యక్రమాల్లో యువత పాత్రను ఎంతమేర పెంచుతుంది? రాబోయే రోజుల్లో దీనికి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు? అన్నదే ఇప్పుడు ఆసక్తికరం. అంటే.. ‘జై కొట్టు’ పేరు పెట్టడంతో కథ మొదలైంది. ఆ పేరుకు తగ్గ పని మొదలుపెట్టడమే జనసేన ముందున్న అసలు సవాలు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
