విజయవాడ, జూలై 31: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి రానున్నారు. అక్కడ జనసేన ముఖ్యనేతలతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో మూడో విడత వారాహి యాత్ర షెడ్యూల్‌పై చర్చింస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్రకు జనసైనికుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ఇప్పటికే రెండు విడుతల్లో ఈ యాత్రను పవన్ కళ్యాణ్ పూర్తి చేశారు. ఈ యాత్రలో భాగంగా ఏపీ ప్రభుత్వం పై జనసేన అధినేత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థపైనా పలు ప్రశ్నలను పవన్ లేవనెత్తారు. పవన్ వ్యాఖ్యలు ఏపీలోనేకాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రెండు విడతలుగా చేపట్టిన వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ నేతల మధ్య పోటాపోటీగా మాటల యుద్ధం సాగడంతో ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగింది. రెండో విడుత వారాహి విజయ యాత్ర తరువాత గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్.. మళ్లీ మూడో విడత యాత్రను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర ఇప్పటికే రెండు విడతల్లో పూర్తయింది. జూన్ 14న కత్తిపూడి నుంచి ప్రారంభమైన మొదటి విడత యాత్ర అదే నెల 30న భీమవరం సభతో ముగిసింది. ఉమ్మడి జిల్లాల్లో పది నియోజకవర్గాలను పవన్ తన మొదటి పర్యటన ద్వారా కవర్ చేశారు. ఆ తరువాత రెండో విడత వారాహి విజయ యాత్ర జూలై 9 నుంచి ఏలూరులో ప్రారంభమై 14వ తేదీన తణుకు సభతో ముగిసింది. తాజాగా మూడో విడత వారాహి విజయ యాత్రకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ప్రారంభ తేదీనిసైతం ఇప్పటికే ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, పవన్ సోమవారం సాయంత్రం మంగళగిరి పార్టీ కార్యాలయంకు చేరుకుంటారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. ఈ సమావేశంలో మూడో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభ తేదీపై చర్చించనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం