Glass symbol to Janasena Party: పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు గుర్తుకు లైన్ క్లియర్ అయింది. ఎన్నికల సంఘం మరోసారి జనసేన గుర్తుగా గాజు గ్లాస్‌ను కేటాయించింది. ఈ మేరకు జనసేన పార్టీ మంగళవారం కీలక ప్రకటన చేసింది. జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్ ను కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన అభ్యర్థులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేసిన సంగతి విదితమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 137 స్థానాలు, తెలంగాణ నుంచి 7 లోక్ సభ స్థానాలలో జనసేన అభ్యర్థులు అప్పట్లో పోటీలో నిలిచారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రజలకు సేవ చేయడానికి జనసేన అభ్యర్థులు సన్నద్ధమైన తరుణంలో రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడం చాలా సంతోషదాయకమని తెలిపింది. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలు, కేంద్ర ఎన్నికల సంఘంలోని అధికారులు, సిబ్బందికి పేరుపేరునా తన తరఫున, జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటనలో తెలిపారు.
అయితే, ఈ ప్రకటన తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమైన పవన్ కల్యాణ్.. ఏపీతోపాటు.. తెలంగాణ రాజకీయాల వైపు కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ చెప్పకనే చెప్పారు. చంద్రబాబు అరెస్టు తర్వాత స్పీడు పెంచిన పవన్ కల్యాణ్.. టీడీపీతో పొత్తు గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. టీడీపీతో తాము కలిసే ప్రయాణం చేస్తామని.. గౌరవ ప్రదమైన సీట్లు లభిస్తాయంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా త్వరలోనే వారాహి విజయ యాత్రకు కూడా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో తమ పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించిన నేపథ్యంలో పవన్ పార్టీ జనసేన విడుదల చేసిన ప్రకటన.. రెండు రాష్ట్రాల్లో పోటీకి సిద్ధమైనట్లు కనిపిస్తుండటం తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..