తెలుగుదేశంజనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండాలి.? రెండు పార్టీలు కలిసి క్షేత్రస్థాయిలో ఎలాంటి పోరాటాలతో ముందుకెళ్లాలి. ఇవే అంశాలపై చర్చించేందుకు మరోసారి జేఏసీ సమావేశం కాబోతుంది. రెండు పార్టీల నేతలు చర్చించిన తర్వాత ఉమ్మడి కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశం ఉంది. టీడీపీజనసేన ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ రెండోసారి సమావేశం అవుతుంది. విజయవాడలోని ఓ ప్రయివేట్ హోటల్లో జరిగే ఈ సమావేశానికి నారా లోకేష్ తో పాటు రెండు పార్టీల నుంచి నియమించిన కమిటీ సభ్యులు 12 మంది హాజరు కానున్నారు.
రాజమండ్రిలో జరిగిన మొదటి సమావేశానికి జేఏసీ సభ్యులతో పాటు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కొనసాగింపుగా, రెండో సమావేశం జరగనుంది. రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది..? రెండు పార్టీలు కలిసి క్షేత్రస్థాయిలో పోరాటాలు ఎలా చేస్తాయన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. టీడీపీ-జనసేన పొత్తు కుదిరి రోజులు గడిచిపోతుంది. అయినా ఉమ్మడి పోరాటాలపై మాత్రం స్పష్టత రావడం లేదు.
రెండు పార్టీల మధ్య సమన్వయ సమావేశాలు
జేఏసీ మొదటి సమావేశం తర్వాత ప్రభుత్వంపై ఆందోళనల కంటే రెండు పార్టీల కలయికపైనే ముందుగా దృష్టి పెట్టాయి. జిల్లా స్థాయిలో సమన్వయ సమావేశాల్లోనూ రెండు పార్టీల మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసికట్టుగా ముందుకు సాగడంపైనే చర్చించాయి. ఓటు బదలాయింపుపైనా సమన్వయ సమావేశాల్లో చర్చించారు. రెండు పార్టీల ఓట్లు ఇతర పార్టీలకు మళ్లకుండా ఉమ్మడి అభ్యర్ధికే ఖచ్చితంగా వేసేలా చూడాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. మొత్తంగా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో జరిగిన సమావేశాల్లో ఎలాంటి కార్యాచరణ లేకుండా కలిసికట్టుగా సాగడంపైనే చర్చించాయి. విజయవాడల జరిగే సమావేశంలో అన్ని అంశాలపై క్లారిటీ ఇచ్చే దిశగా రెండు పార్టీలు ముందుకెళ్తున్నాయి.
విజయవాడలో జరిగే సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరగనుంది. గత సమావేశంలో మేనిఫెస్టోపై పవన్ కళ్యాణ్-నారా లోకేష్ చర్చించారు. ఆ తర్వాత ఇటీవల చంద్రబాబుతో భేటీ అయిన పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కూడా మేనిఫెస్టో విడుదలపైనే ఎక్కువగా చర్చించారు. దీనికి కొనసాగింపుగా గురువారం జరిగే సమావేశంలో మేనిఫెస్టోకు తుది రూపు తీసుకురానున్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పేరిట తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను రూపొందించింది. ఇది ప్రిలిమినరీ మేనిఫెస్టో మాత్రమే. వాస్తవంగా విజయదశమి రోజు పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తామని చంద్రబాబు అరెస్ట్‌కు ముందు ప్రకటించారు. అది వాయిదా పడింది. సూపర్ సిక్స్‌తో పాటు మరికొన్ని అంశాలతో టీడీపీ ప్రతిపాదనలు సిద్దం చేసింది.
పూర్తిస్థాయి మేనిఫెస్టోకు తుది రూపం..
అటు జనసేన కూడా షణ్ముక వ్యూహం పేరుతో రెండేళ్ల క్రితం ప్రకటించిన అంశాలన్నీ మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రెండు పార్టీల నుంచి ఉన్న ప్రతిపాదనలపై చర్చించిన తర్వాత మేనిఫెస్టోపై ఓ స్పష్టతకు రానున్నట్లు తెలిసింది. త్వరలో పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల దిశగా రెండు పార్టీలు సిద్దమవుతున్నాయి. ఇవాళ జరిగే సమావేశంలో రైతుల సమస్యలు విద్యుత్ చార్జీల పెంపుపై చర్చించనున్నారు. నిరుద్యోగ సమస్య, రోడ్లు, పేదల గృహ నిర్మాణంలో అవకతవకలు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు, ఇసుక దోపిడీపై నియోజకవర్గ స్థాయిలో ఉమ్మడి పోరాటాల పై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఇప్పటికే జిల్లా స్థాయిలో సమన్వయ సమావేశాలు ముగియడంతో నియోజకవర్గ స్థాయిలో సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు, రైతులను ఆదుకోవాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ రూపొందించనున్నాయి రెండు పార్టీలు.
త్వరలో మరోసారి చంద్రబాబుపవన్ భేటీ
ఇవాళ జరిగే ఉమ్మడి సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై మరోసారి చంద్రబాబుపవన్ భేటీలో చర్చిస్తారు. దీపావళి తర్వాత మరోసారి ఇద్దరు నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనే మేనిఫెస్టో విడుదలకు తేదీని ఖరారు చేయనున్నారు. మరోవైపు ఉమ్మడి పోరాటాలకు కూడా దీపావళి తర్వాత ప్రత్యేక షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. చంద్రబాబుపవన్ భేటీ కంటే ముందుగానే జేఏసీ నేతలు తాత్కాలిక షెడ్యూల్, మేనిఫెస్టోలకు తుదిరూపు తీసుకురానున్నారు. మొత్తానికి వచ్చే వారం నుంచి దూకుడు పెంచేలా టీడీపీజనసేన ప్రణాళికతో ముందుకెళ్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…