Andhra News: రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు.. తల్లిబిడ్డ సేఫ్

పార్వతీపురం మన్యం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రైలు పట్టాలపై ఓ మహిళ ప్రసవించింది. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా పురిటినొప్పులు రావడంతో రైలు దిగి ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. కానీ పట్టాలు దాటే క్రమంలోనే ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. తోటి ప్రయాణికుల మానవత్వంతో కూడిన సాయంతో తల్లిబిడ్డలు క్షేమంగా ఆసుపత్రికి చేరారు

Andhra News: రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు.. తల్లిబిడ్డ సేఫ్
Parvathipuram Railway Tracks Birth

Edited By:

Updated on: Jan 14, 2026 | 10:58 PM

పార్వతీపురం మన్యం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పార్వతీపురం పట్టణ పరిధిలో రైలు పట్టాలు దాటుతున్న సమయంలో ఓ మహిళ ట్రాక్‌పైనే ప్రసవించాల్సి రావడం స్థానికులను ఆందోళనకు గురి చేసింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రియాపాత్రో అనే మహిళ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తోంది. ప్రయాణ సమయంలో అకస్మాత్తుగా ఆమెకు తీవ్రమైన పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. రైలు పార్వతీపురం రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకున్న సమయంలో పురిటినొప్పులు మరింత ఎక్కువయ్యాయి. వెంటనే మహిళను ట్రైన్‌ నుంచి దింపి ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నించారు.

అలా హాస్పిటల్ కి వెళ్లేందుకు రైలు పట్టాలు దాటుతున్న సమయంలోనే ప్రసవ వేదనలు తీవ్రమై, మహిళ అక్కడికక్కడే ట్రాక్‌పైనే మగ శిశువుకు జన్మనిచ్చింది. సరైన వైద్య సదుపాయాలు లేకపోయినా తోటి ప్రయాణికులు మానవత్వంతో స్పందించి తాత్కాలికంగా సపర్యలు చేస్తూ మహిళకు సహాయం అందించారు. వెంటనే సమాచారం అందుకున్న స్థానికులు, కుటుంబసభ్యులు వెంటనే తల్లి, బిడ్డను పార్వతీపురం కేంద్రాసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం తల్లి, శిశువు ఇద్దరూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు తక్షణ వైద్య సహాయం అందేలా రైల్వే శాఖ, రైల్వే యంత్రాంగం మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. మానవత్వంతో స్పందించిన తోటి ప్రయాణికుల సహకారం వల్లే ప్రాణాపాయం తప్పిందని కుటుంబసభ్యులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.