సింగరాయకొండ గురుకులంలో తాగునీటి కష్టాలు.. తాగేందుకు నీళ్లులేక విద్యార్ధినుల ఇక్కట్లు!
గురుకులంలో చదువుకుంటున్న పేదింటి పిల్లలకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన విద్యా, ఆహారం, సురక్షితమైన తాగునీటి సదుపాయం కల్పించడం కనీస బాధ్యత. అయితే తాగేందుకు, స్నానాలు, మరుగు దొడ్ల అవసరాలకు నీళ్లులేక విద్యార్ధులు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా సింగరాయకొండలోని బాలికల గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న దాదాపు 550 మంది విద్యార్ధినులు తాగేందుకు నీళ్లులేక అల్లాడిపోతున్నారు..

సింగరాయకొండ, సెప్టెంబర్ 14: రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని డా.బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్ధినుల ఇక్కట్లు మిన్నంటుతున్నాయి. తాగునీటి కొరత కారణంగా దాహార్తితో అల్లాడిపోతున్నారు. ఆదివారం (సెప్టెంబర్ 13) పేరెంట్స్ సండే కావడంతో మధ్యాహ్నం నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను చూసుకునేందుకు హాస్టల్ వద్దకు చేరుకున్నారు. అయితే హాస్టల్‌లో తాగునీళ్లు అందుబాటులో లేవని తెలిసి.. తమ పిల్లల వద్ద ఉన్న బాటిళ్లు తీసుకుని హాస్టల్ ఎదురుగా ఉన్న దుఖానాల వద్దకు తల్లిదండ్రులు పరుగులు తీశారు. ఈ దృశ్యం ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు హాస్టల్ వద్ద కనిపించింది. తాగేందుకు నీళ్లు అందుబాటులో లేకపోవడంతో బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో స్నానానికి కూడా బాత్రూమ్‌ల వద్ద నీళ్లు అందుబాటులో ఉండటం లేదని, హాస్టల్‌లోని బోరింగ్ వద్ద నుంచి బక్కెట్లతో మోసుకెళ్ల వల్సి వస్తుందని వాపోయారు. ప్రస్తుతం ఆ బోరింగ్ కూడా పని చేయడం లేదని తల్లిదండ్రులకు తెలిపారు.
మరోవైపు సింగరాయకొండ డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నీటి కొరత లేనేలేదని పాఠశాల ప్రిన్సిపల్ అరుణ ప్రగల్భాలు చెబుతున్నారు. తల్లిదండ్రులు స్వయంగా హాస్టల్‌లో పరిస్థితిని గమనించేంత వరకూ ఈ విషయం వెలుగులోకి రాకపోవడం విశేషం. పాఠశాలలోని 3 ఆర్వో ప్లాంట్లు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయని, ఎలాంటి నీటి సమస్య లేదని ప్రిన్సిపల్ అరుణ చెప్పడం విడ్డూరంగా ఉంది. తాగేందుకు గుక్కెడు నీళ్ల కోసం విద్యార్ధినులు హాస్టల్ వద్దకు వచ్చిన తల్లిదండ్రుల చేతికి బాటిల్స్ ఇచ్చి హాస్టల్ ఎదురుగా ఉన్న దుకాణాల వద్ద నీటిని కొనుగోలు చేసి తెప్పించుకుంటున్నారు. ఈ సమస్య దాదాపుగా నెల రోజులుగా ఉన్నప్పటికీ సెప్టెంబర్ 13 (ఆదివారం) జరిగిన పేరెంట్స్ సండే మూలంగా వెలుగులోకి వచ్చింది.
గురుకులంలో చదువుకుంటున్న పేదింటి పిల్లలకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన విద్యా, ఆహారం, సురక్షితమైన తాగునీటి సదుపాయం కల్పించడం కనీస బాధ్యత. అయితే తాగేందుకు, స్నానాలు, మరుగు దొడ్ల అవసరాలకు నీళ్లులేక విద్యార్ధులు అల్లాడిపోతున్నారు. ఈ పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు సమీప గ్రామాలకు చెందిన దాదాపు 550 మంది విద్యార్ధినులు చదువుకుంటున్నారు. అధికారులు స్పందించి సింగరాయకొండ బాలికల గురుకుల పాఠశాలలో కనీస నీటి సదుపాయాలు కల్పించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి స్తున్నారు. రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.




