
తల్లిదండ్రులను కోల్పోయిన ఓ బిడ్డ.. బంధువుల దగ్గర ఉండలేక చదువుకోవాలన్న లక్ష్యంతో సిటీకి వచ్చింది. ఇంతలో మాయదారి రోగంతో ప్రాణాలు వదిలింది. అందరినీ తీవ్రంగా కలచివేస్తున్న ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. అయితే సరైన చికిత్స అందించకపోవడంతో మృతి చెందిందన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో బాలిక మృతిపై సీడబ్ల్యుసీ ఛైర్మన్ చేపట్టిన విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చారు. దీంతో ఐసీడీఎస్ పీడీని ప్రభుత్వానికి సరెండర్ చేశారు.
ఒంగోలు బాలసదన్‌లో ఆశ్రయం పొందుతూ చదువుకుంటున్న బాలిక ఆనారోగ్యానికి గురై.. ప్రాణాలు కోల్పోయింది. కనీసం బాలిక ఏ విధంగా మృతి చెందిందో తెలుసుకునేందుకు పోస్ట్‌మార్టం కూడా నిర్వహించకుండా హడావిడిగా అంత్యక్రియలు నిర్వహించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు బాలిక మృతదేహాన్ని తవ్వి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికైనా బాలిక మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని బాలిక బంధువులు వేడుకుంటున్నారు.
ఒంగోలులోని స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాల సదన్‌లో ఆశ్రయం పొందుతున్న అనాధ, విధివంచిత బాలల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారన్న ఆరోపణలు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా జనవరి 24వ తేదీన 14 ఏళ్ళ మౌనిక అనే బాలిక బాలసదన్‌లో ఆశ్రయం పొందుతూ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించింది. బాలిక మృతిపై ఉన్నతాధికారులు విచారణ కమిటీ వేశారు. బాలసదన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా బాలికకు సకాలంలో చికిత్స అందక చనిపోయినట్టు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తేల్చింది. ఈ ఘటన ఒంగోలులోని స్త్రీ ,శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలసదనంలో చోటుచేసుకుంది.
రిమ్స్ వైద్యశాలలో చికిత్సపొందుతూ జనవరి 24వ తేది వేకువజామున కుంచాల మౌనిక మృతిచెందింది. ఒంగోలు బాలాజీనగర్‌లో నివాసముంటున్న తల్లిదండ్రులు మృతి చెందటంతో వారి కుమార్తె మౌనిక అనాథగా మారింది. దీంతో మౌనికను స్థానికులు బాలసదనంలో చేర్చారు. ఆమెను మూడు నెలల క్రితం బాలసదన్ అధికారులు బాపట్ల జిల్లా చినగంజాం కేజీబీవీలో చేర్చారు. అక్కడ బాలిక తీవ్ర అస్వస్థతకు గురికావటంతో పాఠశాల సిబ్బంది స్థానిక ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చి ఒంగోలు పంపించారు. సంక్రాంతి సెలవులకు ముందు బాలిక ఒంగోలు బాలసదన్‌కు తీసుకొచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాలికను అప్పుడే ఆసుపత్రిలో చేర్చాల్సిన అధికారులు పట్టిపట్టనట్లు వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
జనవరి 19వ తేదీన బాలిక ఆరోగ్యం పూర్తిగా క్షీణించటంతో రిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. బాలిక చికిత్స పొందుతూ జనవరి 24వ తేదీ వేకువజామున మృతిచెందింది. బాలిక మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. మృతురాలి అమ్మమ్మ ఫిర్యాదుతో అధికార యంత్రాంగం కదిలింది. దీంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ వేము రామాంజనేయుడు ప్రాథమిక విచారణ చేపట్టారు. బాలికకు ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించిపోతున్నా బాలసదనమ్ సిబ్బంది కాని, జిల్లా బాలల సంరక్షణ కమిటీ విభాగం కాని సకాలంలో స్పందించలేదని ఆయన నివేదిక సమర్పించారు. ఆమె ఆరోగ్యపరిస్థితి విషమించిన సమయంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని నివేదికలో తెలిపారు.
బాలిక మృతిపై జీజీహెచ్ సూపరింటెండెంట్, ఇతర వైద్యులతో మాట్లాడారు. బాలిక పరిస్థితి పూర్తిగా విషమించిన తర్వాతే ఆసుపత్రికి తీసుకువచ్చారని వైద్యులు తెలియజేశారు. సకాలంలో వైద్యం అందక మృతి చెందిన మౌనిక మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించకుండా హడావిడిగా అంత్యక్రియలు నిర్వహించినట్లు తేలింది. అధికారుల నిర్లక్ష్యంపై ప్రభుత్వానికి ఛైల్డ్ వెల్‌ఫేర్ కమిటీ ఛైర్మన్ నివేదిక పంపారు. దీంతో కదిలిన జిల్లా యంత్రాంగం స్త్రీ, శిశు సంక్షేమ అధికారిణి సువర్ణను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. మరోవైపు, బాలసదన్‌లో చిన్నారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు విడుదల చేసిన నిధులను కూడా ఖర్చు పెట్టలేదన్న ఆరోపణలపై విచారణ జరుగుతోంది.
తమ మనవరాలు మృతిపై కారణాలు తెలుసుకుని బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ మృతురాలి అమ్మమ్మ చింతలపూడి గంగమ్మ ఉన్నతాధికారులను ఆశ్రయించారు. అమరావతిలోని ముఖ్యమంత్రి ప్రజా వేదికకు వెళ్ళిన మౌనిక అమ్మమ్మ, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి ఫిర్యాదు చేశారు. ఆ తరువాత కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజా సంఘాల సహకారంతో ఒంగోలు టూటౌన్ పియస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పూడ్చిపెట్టిన సమాధిని తవ్వి పోస్ట్‌మార్టం నిర్వహించారు. అయితే బాలిక మృతికి ఆమెకు దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయని, హెఐవీ, ఊపిరితిత్తుల వ్యాధి ఉందని బాలసదన్ అధికారులు చెబుతున్నారు. కాగా, ఆమెకు హెచ్‌ఐవీ పాజిటివ్ ఉంటే బాలసదన్‌లో ఎలా చేర్చుకున్నారని బాలిక బంధువులు ప్రశ్నిస్తున్నారు. తమ బిడ్డ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బాలిక అమ్మమ్మ చింతలపూడి గంగమ్మ వేడుకుంటోంది.
కాగా, బాలసదన్ అధికారులు మాత్రం మౌనికకు హెచ్‌ఐవీ పాజిటివ్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందిందని చెబుతున్నారు. బాలిక అనారోగ్యంతో మృతి చెందిన కారణంగా ఎలాంటి వివాదం లేనందున తొలుత పోస్ట్‌మార్టం నిర్వహించలేదన్నారు. ప్రస్తుతం బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నట్టు బాలసదన్ అధికారులు చెబుతున్నారు. బాలికకు హెచ్‌ఐవీ ఉందన్న సంగతి ముందు తెలియదని, ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తరువాత హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్నట్టు తెలిసిందన్నారు. అలాగే బాలిక తల్లిదండ్రులు ఇద్దరూ హెచ్‌ఐవీ పాజిటివ్‌తో చనిపోయారని జీజీహెచ్‌లో రికార్డులు ఉన్నాయని చెబుతున్నారు. బాలిక మృతి పట్ల తమ నిర్లక్ష్యం లేదని బాలసదన్ సంరక్షణ అధికారి దినేష్‌కుమార్ చెబుతున్నారు.
బాలసదన్‌లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన బాలిక మౌనిక మృతిపై ఆమె అమ్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్ట్‌మార్టం నిర్వహించినట్టు ఒంగోలు టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు తెలిపారు. పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చిన తరువాత ఆమె మృతిపై తదుపరి విచారణ చేస్తామని తెలిపారు. మౌనిక మృతి ఘటనలో బాలసదన్ సిబ్బంది నిర్లక్ష్యం, స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారుల నిర్లక్ష్యం ఉందన్న ప్రాధమిక నివేదికలతో ఇప్పటికే ఐసీడీఎస్ పీడీ సువర్ణను జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. తాజాగా బాలిక మృతికి గల కారణాల కోసం పోస్ట్‌మార్టం నిర్వహించడంతో దీని ఆధారంగా మరికొంతమంది బాలసదన్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..