
Challa Ramakrishna Reddy’s family Controversy: దివంగత మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణ రెడ్డి కుటుంబంలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. దీంతో నంద్యాల జిల్లా అవుకులో ఉద్రిక్తత నెలకొంది. చల్లా పెద్ద కుమారుడు చల్లా విగ్నేశ్వర్ రెడ్డికి.. చిన్న కుమారుడి సతీమణి చల్లా శ్రీలక్ష్మి మధ్య వార్ నడుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన చల్లా శ్రీలక్ష్మి.. విగ్నేశ్వర్ రెడ్డిలు రెండు వర్గాలుగా విడి పోవడం, గొడవలకు దిగడం అవుకులో మరోసారి చర్చనీయాంశంగా మారింది. అవుకులోని చల్లా భవన్‌లో తనపై బావ, ఆడపడుచులు దాడి చేశారని చల్లా శ్రీలక్ష్మి ఆరోపించారు. ఘర్షణలో చల్లా శ్రీలక్ష్మి, చల్లా రామకృష్ణ రెడ్డి సతీమణి శ్రీదేవికి గాయాలయ్యాయి. చల్లా శ్రీలక్ష్మిని బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చల్లా సతీమణి శ్రీదేవికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అనంతరం నంద్యాల డాక్టర్ల సూచనతో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. అయితే పార్కింగ్ విషయంలో మొదలైన మాటకు మాట ఘర్షణకు కారణమైందని తెలుస్తోంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడం, వరుస సెలవులు రావడంతో దివంగత చల్లా రామకృష్ణారెడ్డి కుమార్తె సాయి పృధ్వీ, బృందా రెడ్డి లు అవుకులోని చెల్లా రామకృష్ణారెడ్డి ఇంటికి చేరుకున్నారు. వారి పిల్లలకు.. అవుకు జడ్పిటిసి చల్లా శ్రీ లక్ష్మీ పిల్లలకు మధ్య చిన్నపాటి తగువు రావడంతో అది పెద్దదై కుటుంబ సభ్యుల మధ్య గొడవకు దారితీసినట్లు పేర్కొంటున్నారు.
ఎమ్మెల్సీ పదవిలో ఉండగా చల్లా రామకృష్ణారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. అనంతరం సీఎం జగన్.. చల్లా రామకృష్ణారెడ్డి చిన్న కుమారుడు చల్లా భగీరథరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే చల్లా భగీరథరెడ్డి కూడా ఆకస్మికంగా మరణించారు. అప్పటి నుంచే చల్లా కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి. చల్లా కుటుంబీకుల చాలా సార్లు ఘర్షణలు పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.
చల్లా శ్రీలక్ష్మి వ్యవహార శైలిపై, ఇతర అంశాలపై సీఎంతో పాటు పార్టీ పెద్దలకు చల్లా రామకృష్ణారెడ్డి కొడుకు విగ్నేష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే ఘర్షణలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు పెట్టుకున్నప్పటికీ రెండు వర్గాలు ఒకే ఇంట్లో ఉండటం వల్లే ఘర్షణలకు వివాదాలకు కారణమని స్థానికులు చెప్తున్నారు. ఎవరో ఒకరు ఇల్లు ఖాళీ చేస్తే కేసుల సంగతేమో కానీ ఘర్షణలు పునరావృతం కాకపోవచ్చు అంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..