Krishna District: పాస్టర్ పరలోక పయనం.. ఎమ్మార్వో కౌన్సిలింగ్.. అయినా కూడా

|

Nov 21, 2022 | 4:48 PM

దేవుడంటే..నమ్మకం ఉండాలి. కానీ మూఢనమ్మకం ఉండకూడదు. మరీ మూఢత్వం ఎక్కువైనా కష్టమే. ఆత్మతో పరలోకానికి ఎవరైనా వెళ్తారా..? వెళ్లి మళ్లీ తిరిగొస్తారా..? యస్‌..నేను తిరిగొస్తానని చెబుతున్నాడు ఓ చర్చి పాస్టర్‌. ఇలా చనిపోయి...అలా తిరిగొస్తానని చెబుతున్నాడు. పాస్టర్‌ చేస్తున్న ప్రచారం ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Krishna District: పాస్టర్ పరలోక పయనం.. ఎమ్మార్వో కౌన్సిలింగ్.. అయినా కూడా
Gollanapalli Pastor
Follow us on

చనిపోతాను.. సమాధి నుంచి లేచొస్తానంటూ హడావుడి చేసిన పాస్టర్ నాగభూషణానికి గన్నవరం ఎమ్మార్వో కౌన్సిలింగ్‌ ఇచ్చారు. పాస్టర్ స్టేట్‌మెంట్ రికార్డు చేసి.. ఫ్లెక్సీ డిజైన్‌ చేసిన వారిపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేవుడి పేరుతో మూఢ నమ్మకాలు ప్రచారం చేస్తే.. చర్యలు తప్పవని ఎమ్మార్వో నరసింహారావు హెచ్చరించారు. అయినా అతనిలో మార్పు రాలేదు. పరలోకంలో దేవుడు పిలిచాడని ఇలా వెళ్లి అలా తిరిగొచ్చేస్తానని గుడ్డిగా వాదిస్తున్నాడు. చనిపోయిన వ్యక్తులెవరూ మళ్లీ బతకరని.. తీరు మార్చుకోవాలని పాస్టర్‌కు అధికారులు వార్నింగ్‌ ఇచ్చారు. కానీ నాగభూషణం మాత్రం ఇంకా పాత పాటే పాడుతున్నాడు. అధికారుల కౌన్సిలింగ్‌ తర్వాత నాగభూషణాన్ని పలకరించింది టీవీ9. పైపైన ప్రార్థనలు చేసే వాళ్లకి దేవుడంటే ఏం తెలుసని ఆయన పేర్కొనడం గమనార్హం. సంపూర్ణంగా ప్రార్థనలు చేసే తనకు దేవుడు కనిపిస్తాడు, వినిపిస్తాడని అన్నారు.

పాస్టర్‌ నాగభూషణం.. ఈ మధ్య చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పాస్టర్ పరలోక పయనం ఏంటి.. మళ్లీ తిరిగి రావడం ఏంటి.. చిప్‌లో తేడా వచ్చి ఇలా మాట్లాడుతున్నాడా ఏంటన్నది చర్చనీయాంశమైంది. 10 రోజుల్లో చనిపోతాను.. 3 రోజుల్లో తిరిగి వస్తానంటూ బ్యానర్ కట్టి మరీ హడావుడి చేశాడు. చివరకు అతన్ని పిలిపించి ఎమ్మార్వో కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. సమాధి తవ్వించుకోవడం, బ్యానర్లు కట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదీర్ఘంగా బ్రెయిన్‌ వాష్‌ చేశాక పాస్టర్‌ని ఇంటికి పంపించారు.

చనిపోయి మళ్ళీ లేస్తానంటూ ప్రజల్లో మూఢత్వాన్ని నూరిపోస్తోన్న పాస్టర్‌ చేష్టలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పిచ్చి ముదిరిందా? మతి భ్రమించిందా? లేకపోతే పాస్టర్‌ పిచ్చివాగుడుని తిప్పికొట్టాల్సింది పోయి కుటుంబ సభ్యులే జీవసమాధికి రంగం సిద్ధం చేస్తుండడం ఏమిటి? పాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు జనవిజ్ఞాన వేదిక సభ్యలు. పాస్టర్‌ తన నిర్ణయాన్ని మార్చుకుంటే సరే, లేదంటే పోలీసులు అదుపులోకి తీసుకుని మానసిన వైద్యశాలకు తరలించే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..