
కన్నుమూసి తెరిచేలోగా ఘోరం జరిగిపోయింది. రైలు ప్రమాదం వందలాది మంది జీవితాల్లో అల్లకల్లోలం సృష్టించింది. వేలాది మంది జీవితాలు క్షణాల్లో తల్లకిందులయ్యాయి. అంతటి ఘోర ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ బయటపడింది శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఓ లక్కీ ఫ్యామిలీ. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
బాలాసోర్ ఘోర రైలు ప్రమాదంలో ఒక్కరో ఇద్దరో కాదు వందలాది మంది బలయ్యారు. ఈ ప్రమాదం వందలాది కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ఎన్నో హృదయాలను ఛిద్రం చేసింది. యావత్ భారత సమాజాన్ని పెను విషాదంలోకి నెట్టివేసింది ఈ ఘోర ప్రమాదం. రెప్పపాటులో తరుముకొచ్చిన మృత్యువునుంచి తప్పించుకోలేక రైలుమధ్యపడి నలిగిపోయారు వందలాది మంది ప్రయాణికులు. వందలాది మందిని బలితీసుకున్న ఈ ఘోర ప్రమాదం దేశంలోనే అతిపెద్ద రైలు ప్రమాదం.
అయితే మృత్యు శకటంగా మారిన బెంగళూరు హౌరా ఎక్స్‌ప్రెస్‌లో రేణిగుంట నుంచి హౌరా బయలుదేరిన ఓ కుటుంబం అదృష్టవశాత్తూ ఘోర ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఉద్యోగ రీత్యా రేణిగుంటలో నివాసముంటోన్న శ్రీకాకుళం జిల్లాకి చెందిన చంద్రమౌళి కుటుంబం..స్నేహితులతో కలిసి బెంగళూరు హౌరా ఎక్స్‌ప్రెస్‌లో హౌరాకి రిజర్వేషన్ చేయించుకుంది. చంద్రమౌళి కుటుంబం రైలు ఎక్కిన తరువాత స్నేహితుడి కుటుంబం అనివార్య కారణాల వల్ల టూర్ క్యాన్సిల్ చేసుకుంది. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో అదే రైల్లో ఉండిపోయింది చంద్రమౌళి కుటుంబం.
కొంత దూరం ప్రయాణించాక మార్గం మధ్యలో చంద్రమౌళి మనసు మార్చుకున్నాడు. స్నేహితుడి కుటుంబం మధ్యలోనే డ్రాప్ అవడంతో.. అదే రైలు మార్గంలో ఉన్న తమ సొంతూరువైపు మనసు మళ్ళింది. తల్లిదండ్రులను చూసి వెళ్దామని శ్రీకాకుళం రోడ్డులో దిగిపోయి.. స్వగ్రామం బూర్జ మండలం లాబాంకి చేరుకుంది చంద్రమౌళి కుటుంబం.
తెల్లవారి తాము ఎక్కిన రైలు ఘోర ప్రమాదానికి గురైందని తెలుసుకున్న చంద్రమౌళి కుటుంబం ఉలిక్కిపడింది. ప్రయాణం కొనసాగించి ఉంటే ఏం జరిగేదో అన్న ఊహ కూడా భయం కగిలిస్తోందిని అంటోంది చంద్రమౌళి కుటుంబం. పెను ప్రమాదం తప్పిపోవడంతో చంద్రమౌళి కుటుంబం గుండెల నిండా ఊపిరిపీల్చుకుంది. దేవుడి దయతోనే హౌరా ప్రయాణం రద్దయిందని అతని కుటుంబం భావిస్తోంది.
తల్లిదండ్రులను చూడాలన్న కోరిక ఆ కుటుంబాన్ని మృత్యువాకిట్లోంచి బయటపడేలా చేసింది. ప్రాణాపాయం నుంచి బయటడ్డంతో ఓ వైపు ఆనందం.. మరోవైపు అదే రైల్లో తమతో ప్రయాణించిన వారేమయ్యారోనన్న బాధ చంద్రమౌళి కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..