చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు విపరీతమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొనుగోళ్లు లేకపోవడంతో పంటను రోడ్డుపై గుట్టలుగా పడేసి వెళుతున్నారు. దామలచెరువు మ్యాంగో మార్కెట్ లో మండి యజమానులు కొనుగోళ్లు జరపకపోవడంతో ట్రాక్టర్లలో మార్కెట్ కు తీసుకొచ్చిన మామిడి పంటను మొగరాల రోడ్డులో పడేసి వెనుదిరుగుతున్నారు రైతులు. నిన్న మొన్నటి వరకు గిట్టుబాటు ధర లేకపోవడంతో టమోటాలను చిత్తూరు జిల్లా రైతాంగం రోడ్లపై పడేసిన సందర్భాలు చూశాం. ఇప్పుడు మామిడికాయలను పారబోస్తున్న వైనం.. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియజేస్తుంది. తిరుపతి దామలచెరువు రోడ్డులోని మొగరాల వద్ద రోడ్డు పక్కనే గుట్టలు గుట్టలుగా మామిడి కాయలు పడిఉన్నాయి.
కరోనా కల్లోలం నేపథ్యంలో మామిడి ఎగుమతులు తగ్గాయి. దీంతో ఈ ఏడాది రేటు తక్కువగానే ఉంది. అది చాలదన్నట్టు అకాల వర్షాలు రైతుల పొట్ట కొట్టాయి. దీంతో పంట భారీ స్థాయిలో డ్యామేజ్ అయ్యింది. ఉన్న కొద్ది పంటకైనా మంచి రేటు దక్కి.. పెట్టుబడి పెట్టిన డబ్బు అయినా వెనక్కి వస్తుందేమో అని భావిస్తే.. ఇప్పుడు పంటను రోడ్ల పక్కనే పడేయాల్సిన పరిస్థితులు దాపురించాయి.
Also Read: వైద్యశాఖలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియామకానికి తెలంగాణ సర్కార్ గ్రీన్‌సిగ్నల్