Andhra Pradesh: ఏపీలో వాహనదారులకు అలర్ట్.. ఇక ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే బాదుడే..బాదుడు

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో వాహనదారులకు షాక్ ఇస్తూ.. 2020 అక్టోబరులో జారీ చేసిన ఉత్తర్వులను ఇప్పుడు అమలు చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారుల..

Andhra Pradesh: ఏపీలో వాహనదారులకు అలర్ట్.. ఇక ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే బాదుడే..బాదుడు
Ap Motor Vehicle Act
Follow us
Surya Kala

|

Updated on: Feb 21, 2022 | 11:35 AM

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో వాహనదారులకు షాక్ ఇస్తూ.. 2020 అక్టోబరులో జారీ చేసిన ఉత్తర్వులను ఇప్పుడు అమలు చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారుల జేబులు ఖాళీ అయ్యేలా ఫైన్ విధిస్తున్నారు. ద్విచక్ర వాహనదారునకు హెల్మెట్ లేకపోయినా కారులో సీటు బెల్ట్ పెట్టుకోకపోయినా వెయ్యి రూపాయలు ఫైన్ విధిస్తున్నారు. దీంతో ఏపీలోని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 15 వ తేదీ లోపు వాహనదారుల నుంచి దాదాపు రూ. 148 కోట్లు వసూలు చేశారని అంచనా.. వివరాల్లోకి వెళ్తే..

గతంలో వాహనదారులు నిబంధనలను ఉల్లంఘించినా హెల్మెట్ లేకుండా,  కారులో సీటు బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణం చేస్తే.. వంద చెల్లించి వెళ్ళిపోయేవారు. అయితే ఇప్పుడు ఆ వంద వెయ్యి అయింది. అంతేకాదు మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసే అధికారం ట్రాఫిక్ అధికారులు ఉంది. ఇక లారీ, ట్రాక్టార్లు, సరుకులు రవాణా చేసే ఆటోలు కూడా పరిమితి మించి సరుకులను తీసుకుని వెళ్తుంటే.. అధికారులు పట్టుకుంటే.. రూ. 20 వేలు ఫైన్ కట్టాల్సిందే.

దీంతో చాలామంది వాహనదారులు ఇదెక్కడి జరిమానాలు అంటూ అధికారులతో గొడవకు దిగుతున్న సంఘటనలు ఉన్నాయి. అయితే అధికారులు తాము ఏమీ చేయలేమని.. ఏపీలోని కొత్త నిబంధనలు ప్రకారం.. తాము ఫైన్స్ వేస్తున్నామని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా రోజుకు వాహనదారులకు సుమారు కోటి వరకూ జరిమానాలు విధిస్తున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం రహదారి భద్రతలో భాగంగా మోటారు వాహన సవరణ చట్టం-2019 కింద జరిమానాలు పెంచింది. అయితే ఏ నిబంధన ఉల్లంఘిస్తే.. ఎంత జరిమానా అన్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకునే అధికారం ఉందని కేంద్రంతో వాదనకు దిగాయి. చివరకు.. అనేక చర్చల అనంతరం కేంద్రం  37 సెక్షన్లలో కొన్ని మార్పులు చేసింది. 2020, అక్టోబరు 21న కొత్త జరిమానాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులిచ్చింది. అయితే కరోనా కారణంగా ఈ ఉత్తర్వులు అమలులో జాప్యం కలిగింది.

కరోనా కారణంగా వాహనదారులకు కేంద్రం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. వాహనం పర్మిట్లు లేకపోయినా, డైవింగ్‌ లైసెన్స్‌లు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లను రెన్యూవల్ చేయించుకోవడానికి గడుపు పెంచుతూ కొన్ని మినహాయింపులు ఇచ్చింది. అయితే ఆ జీవోని అమలు చేస్తూ.. ఏపీలో  జరిమానాలు విధిస్తున్నారు.

ఇదే విషయంపై ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ..  ఇప్పుడు విధిస్తున్న జరిమానాలు సంబంధించిన ఉత్తర్వులు గతంలో ఇచ్చినవే అని చెప్పారు. అయితే బైక్ వాహనదారులకు, ఆటోలు, వ్యవసాయ ఉత్పత్తులను తీసుకుని వెళ్లే వాహనాల విషయంలో వెసులుబాటునిస్తూ.. వీరు నిబంధనలను ఉల్లంఘించినా వెంటనే ఫైన్ వేయవద్దని సూచించారు. మొదట వీరికి కౌన్సిలింగ్ ఇవ్వాలని అధికారులకు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ జరిమాణాలపై మళ్ళీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Also Read:

స్వాతంత్ర్య సమరయోధురాలు, సామాజికవేత్త శకుంతలా చౌదరి కన్నుమూత.. ప్రధాని మోడీ సంతాపం