
అమరావతి, నవంబర్ 20: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం లక్షద్వీప్ దీవుల సరిహద్దుల్లో ఉన్న మాల్దీవుల వరకు విస్తరించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది వచ్చే 24 గంటల్లో ఇది పశ్చిమ, వాయవ్య దిశగా నెమ్మదిగా కదలనున్నట్లు పేర్కొంది. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో గురువారం ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో, శుక్రవారం కృష్ణా, బాపట్ల, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్ర, శని, ఆదివారాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు, మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
ఇదిలా ఉంటే మరోవైపు నవంబర్ 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇది పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడుతుందన్నారు. ఆ తదుపరి 48 గంటల్లో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి నవంబర్ 24 నాటికి వాయుగుండం గా మారే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఆ తదుపరి 48 గంటలలో వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో రాగల రెండు, మూడు రోజులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇక రాష్ట్రంలో చలి తీవ్రత కూడా విపరీతంగా పెరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 4.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కిలగడలో 5.8, డుంబ్రిగూడ 7.8, కరిముక్కిపుట్టి 8, పాడేరు 8.1, అరకు, పెదబయలు 8.4 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. క్రమంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.