Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయసాయిరెడ్డి నోట శేఖర్‌రెడ్డి మాట.. ఇంతకీ.. ఎవరీ కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ?

ఇప్పటివరకు హూ ఈజ్‌ కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అని ఎవరూ పట్టించుకోనప్పటికీ.. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల తర్వాత ఆయన ఎవరు అనేది ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. చివరికి వైసీపీ వర్గాలు కూడా కసిరెడ్డి గురించి ఆరా తీస్తున్నాయి. ఈ క్రమంలోనే.. కసిరెడ్డి కథ అంతా బయటపడుతోంది.

విజయసాయిరెడ్డి నోట శేఖర్‌రెడ్డి మాట..  ఇంతకీ.. ఎవరీ కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ?
Ap Liquor Scam Case
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 13, 2025 | 7:59 AM

కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి.. ఈ పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మారుమోగుతోంది. లిక్కర్ స్కామ్‌ కేసులో కసిరెడ్డే కింగ్‌మేకర్‌ అన్న విజయసాయిరెడ్డి కామెంట్స్‌తో ఒక్కసారిగా ఆయన హాట్‌టాపిక్‌గా మారారు. ఇంతకీ.. ఎవరీ కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి..? ఈయన పేరును విజయసాయిరెడ్డి సడెన్‌గా ఎందుకు తెరపైకి తెచ్చారు..? ఇటీవలే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.. గతంలో నెలకొన్న విభేదాలతోనే బరస్ట్‌ అయ్యారా?.. సాయిరెడ్డి ఓపెన్ అయ్యారా అన్నదీ ఇప్పుడు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది.

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం వ్యవహారం మరోసారి పెద్ద దుమారం రేపుతోంది. ఈ కేసులో తాజాగా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. కాకినాడ సెజ్‌ కేసులో విజయవాడ సీఐడీ పోలీసుల ఎదుట విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి టార్గెట్‌గా హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఏపీ లిక్కర్‌ సేల్స్‌ స్కామ్‌లో పాత్రదారి, సూత్రదారి కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డే అని బాంబు పేల్చారు. అంతేకాదు.. మరిన్ని విషయాలు సమయం వచ్చినప్పుడు బయట పెడతానని వ్యాఖ్యానించడం సంచలనంగా సృష్టిస్తోంది.

వాస్తవానికి.. ఏపీ మద్యం అమ్మకాల కుంభకోణంలో మొత్తం వ్యవహారాన్ని కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెర వెనుక ఉండి నడిపించారని ఆరోపణలు ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే విజయసాయిరెడ్డి కూడా ఆయన గురించి కామెంట్స్‌ చేయడం ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఏపీలో ఇబ్బడిముబ్బడిగా అనుమతులు లేకుండా ప్రవేశపెట్టిన లిక్కర్‌ బ్రాండ్స్‌పై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. లిక్కర్‌ సేల్స్‌లో డబ్బులు పక్కదారి పట్టించారని.. డిజిటల్ లావాదేవీలు లేని అమ్మకాలలో గత ప్రభుత్వంలోని కొందరు పెద్దల పాత్ర ఉందని టీడీపీ ఆరోపిస్తూ వచ్చింది.

అయితే.. అప్పట్లో ఆ విమర్శలను వైసీపీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మద్యం కుంభకోణంలో తెర వెనుక లావాదేవీలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించింది. దాంతో.. నాటి ఏపీబీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. వేల కోట్ల వ్యాపారంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనే ఆరోపణలతో కేసులు నమోదు అయ్యాయి. కాగా.. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేరును విజయసాయిరెడ్డి కూడా బయటపెట్టడంతో ఆయన వ్యవహారం మరింత చర్చనీయాంశం అవుతోంది.

ఇక.. ఇప్పటివరకు హూ ఈజ్‌ కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అని ఎవరూ పట్టించుకోనప్పటికీ.. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల తర్వాత ఆయన ఎవరు అనేది ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. చివరికి వైసీపీ వర్గాలు కూడా కసిరెడ్డి గురించి ఆరా తీస్తున్నాయి. ఈ క్రమంలోనే.. కసిరెడ్డి కథ అంతా బయటపడుతోంది. కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి.. విదేశాల్లో లిక్కర్ కంపెనీలను నడుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. వైపీసీ అధికారంలోకి రాగానే ఐటీ సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. అనతికాలంలోనే జగన్ టీంలో కీలక వ్యక్తిగా మారారు. గత ప్రభుత్వంలో షాడో సీఎంగా పని చేశారన్న విమర్శలు సైతం ఉన్నాయి.

పేరుకు ఐటీ సలహాదారుడు అయినా తనకున్న అనుభవంతో మద్యం అమ్మకాలు, కొనుగోళ్లలో చక్రం తిప్పారనే టాక్‌ గట్టిగా నడిచింది. ఇటీవల ఏపీ లిక్కర్‌ సేల్స్‌ కేసులో అరెస్టయిన వాసుదేవరెడ్డి కూడా తనకు ఏ సంబంధం లేదంటూ.. కసిరెడ్డి పేరును సీఐడీ విచారణలో వెల్లడించారు. కానీ.. కసిరెడ్డి ఎక్కడ ఉన్నారో.. కూటమి ప్రభుత్వానికి.. సీఐడీకి తెలియకపోవడంతో ఆయన కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.

ఇదిలావుంటే.. కసిరెడ్డిని జగన్‌కు దగ్గర చేసింది విజయసాయిరెడ్డే అంటున్నారు కొందరు వైసీపీ నేతలు. అధికారంలో ఉన్నప్పటి విభేదాలతోనే విజయసాయిరెడ్డి.. కసిరెడ్డి పేరు తెరపైకి తెచ్చి కొత్త వివాదానికి ఆజ్యం పోశారనే చర్చ సైతం నడుస్తోంది. మొత్తంగా.. విజయసాయిరెడ్డి కామెంట్స్‌తో లిక్కర్‌ స్కామ్‌ కేసులో కొత్త ఎపిసోడ్‌ తెరపైకి రావడం హీట్‌ పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..