నియోజకవర్గాల పునర్విభజన ఖాయమేనా? విపక్షాల అభ్యంతరం అందుకేనా?
వచ్చే ఏడాది దేశంలో నియోజకవర్గాల పునర్విభజన ఖాయమేనా? అదే జరిగితే.. జనాభా ప్రాతిపదికనా? పాత లెక్కల ప్రకారమా? కేంద్రం తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకెళ్తే పోరుబాట తప్పదని హెచ్చరిస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. డీలిమిటేషన్ ప్రయత్నాలతో మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. అంతేకాదూ.. దండయాత్రకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి.

వచ్చే ఏడాది దేశంలో నియోజకవర్గాల పునర్విభజన ఖాయమేనా? అదే జరిగితే.. జనాభా ప్రాతిపదికనా? పాత లెక్కల ప్రకారమా? కేంద్రం తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకెళ్తే పోరుబాట తప్పదని హెచ్చరిస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. అంతేకాదూ.. దండయాత్రకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి.
దేశంలో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే తమకు తగిన నిధులు కేటాయించడం లేదని కేంద్రంపై దక్షిణాది రాష్ట్రాలు గుర్రుగా ఉన్నాయి. ఈ క్రమంలో డీలిమిటేషన్ ప్రయత్నాలతో మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నాయి.
డీలిమిటేషన్‌పై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిసైడైంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా అన్ని పార్టీలు హాజరుకావాలంటూ బహిరంగ లేఖ రాశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. డీలిమిటేషన్‌తో రాష్ట్రానికి జరిగే అన్యాయంపై అన్ని పార్టీలతో చర్చించి.. సమావేశం వేదికగా ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని భావిస్తోంది రేవంత్ సర్కార్.
డీలిమిటేషన్‌తో తక్కువ జనాభా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని.. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఒకవేళ కొనసాగించాలనుకుంటే 1971 జనాభా ప్రాతిపదికన తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పునర్విభజన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య మండిపడ్డారు. గందరగోళం సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ముందుకెళ్తే పోరుబాట తప్పదని హెచ్చరించారు.
డీలిమిటేషన్‌పై అందరి కంటే ముందుగా ఆందోళన వ్యక్తం చేశారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసే పనిలో పడ్డారు. సీఎంలతోపాటు పార్టీ అధినేతలకు మార్చి 22న సమావేశం అవుదాం రమ్మంటూ ఆహ్వానం పంపారు. ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, వైసీపీ చీఫ్ జగన్‌కు స్టాలిన్ లేఖ రాశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ అధ్యక్షులు కేసీఆర్, ఒడిశా మాజీ సీఎంలను భేటీకి ఆహ్వానించారు. ఉత్తరాదిలో బీజేపీ వ్యతిరేక పార్టీలకు లేఖలు రాశారు స్టాలిన్. డీలిమిటేషన్ తీరుకి వ్యతిరేకంగా జేఏసీ ఏర్పాటు చేద్దామని లేఖలో పేర్కొన్నారు.
దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు డీలిమిటేషన్‌పై ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. ఏపీ సీఎం చంద్రబాబు అందుకు భిన్నంగా స్పందించారు. పునర్విభజన ప్రక్రియ పూర్తయితే దాదాపు 75మంది మహిళలు అసెంబ్లీకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు పునర్విభజన ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా కొనసాగుతుందని భరోసా ఇస్తున్నారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఎవరికి ఎలాంటి అభ్యంతరాలున్నా లేవనెత్తే స్వేచ్ఛ ఉంటుందన్నారు. సంబంధిత అంశాలపై అధికారులు చర్చలు జరుపుతారని, నిర్ణయం న్యాయంగా ఉంటుందన్నారు. శాసనసభ అయినా లోక్‌సభ అయినా ప్రతి రాష్ట్రంలోనూ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత సహజంగా సీట్ల సంఖ్య పెరుగుతుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
డీలిమిటేషన్‌తో నష్టపోతామని దక్షిణాది రాష్ట్రాలు.. అలాంటి ఆందోళన అక్కర్లేదని కేంద్రం వాదిస్తోంది. అయితే సౌత్ స్టేట్స్ అనుమానాలను మోదీ ప్రభుత్వం నివృత్తి చేస్తూ ఎలా ముందుకెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..