ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఆకులు చిగురిస్తూ ఉన్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇటు కర్ణాటక, అటు తెలంగాణలో విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. రానున్న ఎన్నికల్లో అధికార విపక్ష పార్టీలతో పోటీకి సై అంటూ భవిష్యత్ కార్యచరణపై ఫోకస్ పెట్టారు నేతలు.
విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో వరుసగా మూడు రోజులు జరిగిన పొలిటకల్ ఎఫైర్స్ అండ్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశాల్లోని పలు కీలక అంశాలపై చర్చించారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ సమావేశాల్లో ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో పాటు వివిధ విభాగాల ఛైర్మన్లు పాల్గొన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు 60 రోజుల ఎన్నికల ప్రణాళికను సిద్దం చేశారు. జనవరి 20వ తేదీ నుంచి ఇంటింటికి కాంగ్రెస్ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీని వీడిన వారందరూ మళ్లీ తిరిగి పార్టీలో చేరాలంటూ పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, విశాఖలో నిర్వహించే ఆందోళనల్లో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. అ తర్వాత అమరావతి, పోలవరం, ప్రాజెక్టులను రాహుల్ సందర్శించే విధంగా ప్లాన్ చేశారు.
మరోవైపు, రాయలసీమ వెనకబాటుతనంపై ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలోనే రాష్ట్రం మొత్తం ఆరు భారీ బహిరంగ సభలు నిర్వహించేలా పీసీసీ అధిష్టానం నిర్ణయించింది. ఇంటింట కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి కాంగ్రెస్ మేనిఫెస్టో అందించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 685 మండలాల అధ్యక్షులతో పాటు, అధికార ప్రతినిధులకు ఎన్నికలకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ సమావేశంలో నిర్ణయించారు. మరోవైపు డిసెంబర్ 8వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడలో డిసెంబర్ 29వ తేదీన ఏఐసీపీ సెంటినరీ ఉత్సవాలు నిర్వహించబోతోంది. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ అండ్ కో ఆర్డినేషన్ కమిటీల సమావేశాలు ఈ విషయాలను తీర్మానం చేశాయి.
గడిచిన తొమ్మదిన్నర ఏళ్ల కాలంలో టీడీపీ, వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీల పాలనలో రాష్ట్రం ఎంత వెనుకబడిపోయిందో ప్రజలు గమనించారని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, ఉపాధి హామీ, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఉపాధి హామీ పథకం, ఉచిత విద్యుత్, సామాజిక పెన్షన్లు అన్నీ కాంగ్రెస్ పార్టీనే ప్రారంభించిందని ఆయన గుర్తు చేశారు. బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అని తెలిపిన గిడుగు రుద్రరాజు.. ఏపీ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, పోలవరం, వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఉండాలన్నారు. ఇవన్నీ కావాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని.. దీనికి ప్రజలందరూ సహకరించాలని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు విజ్ణప్తి చేశారు.
గతంలో ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారులకు మాత్రమే బదిలీలు ఉండేవని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కొందరు ఎమ్మెల్యేలను పక్క నియోజకవర్గాలకు మార్చుతూ సీఎం జగన్ రాజకీయ బదిలీలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు విమర్శించారు. ఐదేళ్లు ఒక నియోజకవర్గంలో పని చేసిన తరువాత, పక్క నియోకవర్గంలో ఆ ఎమ్మెల్యేలు ఏమి చేయగలరని ఆయన ప్రశ్నించారు. నిర్భంధంగా పదవులలో ఉంటూ, ప్రజా సేవ ఎలా చేస్తారని, పార్టీ నుంచి బయటకు వెళ్లిన వాళ్లు అందరూ. కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…