AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. రేపే ఖాతాల్లోకి రూ.25 వేలు జమ..

చేనేత కుటుంబాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘నేతన్న సేవలో’ పథకం కింద అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 71,536 కుటుంబాలకు మొత్తం రూ.179 కోట్ల సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Andhra: వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. రేపే ఖాతాల్లోకి రూ.25 వేలు జమ..
Andhra Government
Ram Naramaneni
|

Updated on: Aug 06, 2026 | 4:46 PM

Share

చేనేత కుటుంబాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉచిత విద్యుత్, వివిధ రాయితీలు, 50 ఏళ్లకే పింఛన్ వంటి పథకాలతో నేతన్నలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు నేతన్న సేవలో పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తోంది. ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది.

12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 71,536 చేనేత కుటుంబాలకు మొత్తం రూ.179 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం జమ చేయనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీ లేకపోయినా.. చేనేత వృత్తిని పరిరక్షించడం, నేతన్నల జీవనోపాధిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

చేనేత రంగానికి వరుసగా ప్రోత్సాహం

‘నేతన్న సేవలో’తో పాటు ఇప్పటికే చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు, పవర్‌లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఈ పథకం ద్వారా 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్‌లూమ్ యూనిట్లు లబ్ధి పొందుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ.150 కోట్లు వెచ్చిస్తోంది.

అదేవిధంగా 50 ఏళ్లు దాటిన 85 వేల మంది చేనేత కార్మికులకు నెలకు రూ.4 వేల పింఛన్ అందిస్తూ, దీనికోసం ఏడాదికి రూ.420 కోట్లు ఖర్చు చేస్తోంది. అలాగే 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ రూపంలో రూ.79 కోట్లు మంజూరు చేసింది.

మౌలిక సదుపాయాల అభివృద్ధిపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్, అమరావతి శాఖమూరులో చేనేత-హస్తకళల మ్యూజియం ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో రూ.4,200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్‌టైల్ రీసైక్లింగ్ యూనిట్ కూడా ఏర్పాటు కానుంది.

సీఎం చంద్రబాబు చీరాల పర్యటన షెడ్యూల్

‘నేతన్న సేవలో’ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం చీరాల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 10.50 గంటలకు వేటపాలెం మండలం కొత్తపేటకు చేరుకుంటారు. అనంతరం 11.05 గంటలకు ప్రజావేదికలో జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

మధ్యాహ్నం 1.35 గంటలకు జాండ్రపేటలో ఏర్పాటు చేసిన చేనేతల వర్క్‌షాప్‌లో లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం 4.10 గంటలకు కొత్తపేటలో టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4.45 గంటలకు తిరిగి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.

Follow Us