Nellore Politics: నెల్లూరు జిల్లాలో సుధీర్ఘ రాజకీయానుభవం వున్న కుటుంబం ఆనం కుటుంబం. వారి కుటుంబం నుండి నాలుగో తరం వారు కూడా రాజకీయాలలో ప్రవేశించివున్నారు. ధీర్ఘకాల రాజకీయ ప్రయాణంలో ఆ కుటుంబం ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. పదవులు అనుభవించారు. రాజకీయ శూన్యత చవిచూశారు. వర్గ రాజకీయాలలో ఎత్తులకు పైఎత్తులు వేశారు. రాజకీయ పోరాటాలలో పైచేయి సాధించిన సందర్భాలున్నాయి. అలాగే చిత్తయిపోయిన సంఘటనలూ వున్నాయి. ఆనం కుటుంబం 2014 ఎన్నికల దాకా సాగించిన రాజకీయ ప్రయాణం ఒకెత్తయితే.. 2014 నుండి వారు సాగిస్తున్న ప్రయాణం మరో ఎత్తు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణం, ఆ తర్వాత జరిగిన రాష్ట్ర విభజన, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగుకావడం వంటివి వారి రాజకీయ ప్రస్థానంలో అనేక మలుపులకు కారణమయ్యాయి.
ఆనం కుటుంబంలో సీనియర్ రాజకీయనేతగా వున్న మాజీ మంత్రి, వెంకటగిరి శానససభ్యులు ఆనం రామనారాయణరెడ్డి 2014కు ముందు కాంగ్రెస్ పార్టీలో దాదాపు సీఎం కుర్చీ స్థాయికి ఎదిగారు. కాని అనుకోని అవాంతరాలు ఎదురై ఆ సీటు ఆయనకు దక్కలేదు. 2014 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్ లేదని నిర్ధారించుకున్నాక తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే అక్కడ తమకు సరైన గుర్తింపు, గౌరవం దక్కలేదన్న అసంతృప్తితో 2019 ఎన్నికలప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికలలో వెంకటగిరి అసెంబ్లీ నుండి వైసిపి అభ్యర్థిగా పోటీచేసి ఘనవిజయం సాధించారు.
అయితే, ఆనం రామనారాయణరెడ్డి వైసిపి ఎమ్మెల్యేగా గెలిచాడన్న మాటేగాని, ఆ పార్టీలో ఇమడలేకపోయారు. ముఖ్యంగా ఒకప్పుడు కాంగ్రెస్‌లో తమ ముందు పసికూనలాగా వున్నటువంటి నాయకులు ఇక్కడ వైసిపిలో తమపైనే పెత్తనం చేయడాన్ని సహించలేకపోయారు. అదీగాక ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి తనకు సరైన గౌరవం ఇవ్వలేదనే బాధ ఆయనను వెంటాడింది. ఈ నేపథ్యంలోనే పార్టీలో చేరిన మూడేళ్లకే ఆయన వైసిపి ప్రభుత్వంపై అసమ్మతి స్వరం వినిపించారు. నాలుగేళ్లు కూడా దాటక ముందే దాదాపు పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఇప్పుడు తిరిగి తెలుగుదేశం పార్టీలోకే రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తెలుగుదేశం పార్టీ నుండి ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతున్నాడనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆయన ఆత్మకూరు నుండి బరిలోకి దిగాలనే నిర్ణయం ఒకరకంగా సాహసోపేతమేనని చెప్పుకోవాలి..
వాస్తవంగా పరిశీలిస్తే ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం రామనారాయణరెడ్డికి మంచి పేరుంది. ఈ నియోజకవర్గ చరిత్రలో ఏ ఎమ్మెల్యే చేయనంతటి అభివృద్ధిని ఆనం రామనారాయణరెడ్డి 2009, 2014ల మధ్య తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా వున్నకాలంలో చేసి చూపించాడు. తాను మున్సిపల్ మంత్రిగా వున్న సమయంలో ఆత్మకూరు గ్రామ పంచాయితీని మున్సిపాల్టీగా మార్చిన ఘనత ఆనం రామనారాయణరెడ్డిదే! ఆ తర్వాత ఆర్ధిక మంత్రిగా ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధుల వరద పారించారు. కాని, 2014 ఎన్నికల్లో ఆత్మకూరు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన ఆయనకు డిపాజిట్ కూడా దక్కలేదు. ఆ ఎన్నికలలో ప్రజలకు కాంగ్రెస్‌పై విపరీతమైన వ్యతిరేకత వున్న తరుణంలో ఆనం కూడా అక్కడ నుండి గెలుపును ఆశించలేదు. ఆ రోజు ఆనం కాంగ్రెస్ అభ్యర్థిగా కాకుండా అటు తెలుగుదేశమో.. ఇటు వైసిపి అభ్యర్థో అయ్యుంటే ఫలితం ఇంకో విధంగా ఉండేదేమో!
ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం రామనారాయణరెడ్డికి మంచిపేరు వున్నమాట వాస్తవమే! అయితే ఇంతవరకు ఆత్మకూరు ప్రజలు ఆయనను కాంగ్రెస్ దృష్టితో చూశారు. ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగితే ఇక్కడి ప్రజలు ఇదే ఆదరణను చూపిస్తారా? అన్నది సందేహం. ఎందుకంటే జిల్లాలోనే ఒకప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైసిపి బలంగా వున్న నియోజకవర్గాలలో ఆత్మకూరు మొదటి స్థానంలో వుంది. 1983 నుండి తెలుగుదేశం పార్టీ పెట్టాక ఇప్పటివరకు 7సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఇక్కడ తెలుగుదేశంపార్టీ గెలిచింది రెండంటే రెండుసార్లు. అది కూడా ఎన్టీఆర్ ప్రభంజనం బలంగా పనిచేసిన 1983, 1994 ఎన్నికలలో. 1985లో వెంకయ్యనాయుడంతటి వాడిని ఓడించి ఆత్మకూరు ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు.
వైసిపికి ఆయువుపట్టు లాంటి రెడ్డి సామాజికవర్గం ఓట్లు అత్యధికంగా వున్న నియోజకవర్గం ఇదే! ఈ సామాజికవర్గం నుండి ఎంతమంది ఆనం వైపు వెళతారనేది కూడా సందేహమే! అదీగాక తెలుగుదేశం పార్టీలో సీనియర్లుగా వున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు, గూటూరు కన్నబాబు లాంటి నేతలు ఆనంపై అసంతృప్తిగా వున్నారు. వీరి నుండి ఆనంకు పూర్తి సహకారం అందేది అనుమానమే! ఓవరాల్‌గా చూస్తే తాను మంత్రిగా ఏ నియోజకవర్గాన్ని అయితే అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లాడో అదే నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఆనంకు ఆపసోపాలు తప్పవు. అభివృద్ధి మంత్రం ఆత్మకూరులో ఆనంను గెలిపిస్తుందని ఆయన మద్ధతుదారులు ధీమా వ్యక్తంచేస్తుండగా.. నిజంగానే ఆయన మంత్రిగా ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుంటే 2014 ఎన్నికల్లో ఆయన గెలవాల్సింది కదా..? అన్నది ఆయన రాజకీయ ప్రత్యర్థులు వేస్తున్న ప్రశ్న. ఆత్మకూరు ప్రజల దృష్టిలో ఆయన మంచి నాయకుడేగాని ఆయన పోటీకి ఎంచుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఆయనకు సెట్ కాదనే అభిప్రాయం స్థానికంగా వినిపిస్తుంది.
-చెన్నూరు మురళి, స్పెషల్ కరస్పాండెంట్, టీవీ9 నెల్లూరు