సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందని చాటి చెప్పేందుకు వైసీపీ చేస్తున్న సామాజిక సాధికార బస్సుయాత్ర నెల్లూరు జిల్లా కోవూరులో జరిగింది. నిర్విఘ్నంగా సాగుతున్న బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కోవూరు టపా తోపు నుంచి రాజుపాలెం సెంటర్ వరకు ర్యాలీ చేశారు. రాజుపాలెం సెంటర్‌లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. బస్సుయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, మీడియా సలహాదారులు అలీ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రజారంజక పాలన చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని చెప్పారు మంత్రి మేరుగ నాగార్జున. రాష్ట్ర చరిత్రలో దళితుల కోసం.. దళిత క్రైస్తవుల కోసం గొప్పగా ఆలోచించే నాయకుడు జగన్ అని తెలిపారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని చట్టం చేసి.. కేంద్ర ప్రభుత్వానికి పంపిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. ఇదిలా ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఘాటైన విమర్శలు చేశారు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తమ పార్టీకి పనికిరాని ముగ్గురు ఎమ్మెల్యేలను జగన్ తీసేస్తే .. వాళ్లను చేర్చుకున్న పనికిమాలిన పార్టీ టీడీపీ అంటూ విమర్శించారు. మరోవైపు కోవూరు నియోజకవర్గం రాజుపాలెంలో సీఎం అభివృద్ధి ఫండ్ కింద కోటి 70లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రారంభించారు. వైసీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర నిర్విఘ్నంగా సాగుతుంది. కోవూరు నిర్వహించిన బస్సుయాత్రలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి మేరుగ నాగార్జున. పేదల పక్షాన ఉండే సీఎంను వదిలేస్తే చరిత్ర క్షమించదన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ మెచ్చిన పాలన నడుస్తుందన్నారు ఉపముఖ్యమంత్రి రాజన్న దొర.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..