ఆంధ్రప్రదేశ్ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక ప్రచారం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతితో అక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. వైసీపీ, బీజేపీ అభ్యర్థులతోపాటు మొత్తం 14 మంది బరిలో ఉన్నారు. 26వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. 2019 ఎన్నికల్లో ఆత్మకూరులో 83.38 శాతం పోలింగ్ జరిగింది. ఉప ఎన్నిక కాబట్టి ఈసారి ఎంత పోలింగ్ జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.
ఆరు మండలాలు ఉన్న ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల 13 వేల 338 మంది ఓటర్లు ఉన్నారు. పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువ. మహిళా ఓటర్లు లక్షా 7 వేల 367 మంది ఉంటే పురుష ఓటర్లు లక్షా 05 వేల 960 మంది ఉన్నారు. ఈసారి 278 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో సమస్యాత్మక ప్రాంతాలు 122 ఉన్నాయి. ఈ నెల 23న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. దీంతో నియోజకవర్గంలో మైకులు సైలెంట్ అయ్యాయి. 23న జరగనున్న పోలింగ్‌పై అధికారులు దృష్టిపెట్టారు. ఈ మేరకు ఆంధ్ర ఇంజినీరింగ్ కాలేజీలో రిటర్నింగ్ అధికారి హరేంద్రియ ప్రసాద్ ఈవీఎంల పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక ఎన్నికల విధుల్లో 1300 మంది సిబ్బంది పాల్గొననున్నారు. 279 పోలింగ్ బూత్‌లను అధికారులను ఏర్పాటు చేయనున్నారు. 123 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను అధికారులు గుర్తించారు. 123 స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియపై నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికలకు మొత్తం 377 ఈవీఎంలను సిద్ధం చేశారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
ఎన్నికల నియమావళి ప్రకారం నిబంధనను అతిక్రమించే పార్టీలపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా హెచ్చరించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 279 పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.123 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్న మీనా.. ఎన్నికలకు మూడంచెల భద్రత కల్పించామని తెలిపారు. పోలింగ్‌ను వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తామని, ఓటర్లు నిర్భయంగా ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. అక్రమాలపై సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు.