Nara lokesh vs AP Minister Adimulapu Suresh : ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కరోనా మహమ్మారి వేళ పరీక్షలు నిర్వహించి వాళ్ల జీవితాలతో ఆటలొద్దని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి వైసీపీ సర్కారుకి విన్నవించారు. అయితే, దీనిపై మరోసారి స్పష్టత ఇచ్చారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఎవరు ఎన్ని రకాల ప్రయత్నాలను చేసినా.. పరీక్షలు నిర్వహించి తీరతామని స్పష్టం చేశారు. కొవిడ్ ఉద్ధృతి తగ్గాక పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరడం లేదని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. నారా లోకేష్ కు దొరికినట్టు విదేశాల్లో చదివించడానికి అందరికీ సత్యం రామలింగరాజులు దొరకని ఆదిమూలపు సెటైర్లు వేశారు.
అయితే, లోకేష్ మాత్రం పరీక్షలు రద్దుపై విరామం లేని పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ కు లేఖలు రాసిన ఆయన, అటు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేశారు. న్యాయస్థానాలను ఆశ్రయించారు. అక్కడితో ఆగని ఆయన నేరుగా కేంద్రం హోం మంత్రి అమిత్ షాకు లేఖ కూడా రాశారు. ఏపీలో పరీక్షల నిర్వహణ పై జోక్యం చేసుకోవాలని లొకేష్ కోరారు. మరో వైపు ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణపై ఈ నెల 30న క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జూన్ 30కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ రోజే పది పరీక్షలు జరపాలా వద్దా అనేదానిపై కోర్టు స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.