
సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో పర్యటించారు. మూడో రోజు శానిటిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటించిన ఆమె ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రజలను ఆశ్చర్యపరిచారు. కడపల్లి నుండి తుమ్మిసి వరకు ఆమె సాధారణ మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. ఆర్టీసీ బస్సు ఎక్కిన నారా భువనేశ్వరిని బస్ కండక్టర్ టికెట్ అడగడంతో కాసేపు సరదా సంభాషణ జరిగింది. మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితమని సీఎం చెప్పారంటూ భువనేశ్వరి అనడంతో ఉచిత ప్రయాణానికి సంబంధించిన ఆధార్ కార్డు చూపాలని కండక్టర్ అడిగింది. ఎట్టకేలకు ఆధార్ కార్డు చూపించి మరీ నారా భువనేశ్వరి ఇతర మహిళలతో కలిసి ప్రయాణించారు.
బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఆమె మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్త్రీ శక్తి పథకం గురించి ఆరా తీశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. మహిళా సాధికారతపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. తుమ్మిసికి చేరుకున్న అనంతరం నారా భువనేశ్వరి పెద్ద చెరువుకు జల హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలను కుప్పం తీసుకొచ్చారని.. తాగు, సాగు నీటికి ఇబ్బంది లేకుండా చేయడమే ఆయన లక్ష్యమని తెలిపారు.
కుప్పం అభివృద్ధి లక్ష్యంగా 23,000 కోట్ల పెట్టుబడితో 7 పరిశ్రమలను తీసుకురావడం జరిగిందని నారా భువనేశ్వరి వెల్లడించారు. ఆ ఏడు పరిశ్రమల్లో మూడు పరిశ్రమలు కేవలం మహిళల అభివృద్ధికి మాత్రమే ఉపయోగపడే విధంగా తీసుకొచ్చారని వివరించారు. పరిశ్రమలతో పాటు టూరిజం డెవలప్‌మెంట్ కూడా కుప్పంలో జరుగుతుందని తెలిపారు.