
నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట వద్ద బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఏఆర్‌బీసీవీఆర్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు, ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇరు వాహనాలు పూర్తిగా దగ్ధమవ్వగా, ముగ్గురు వ్యక్తులు ప్రాణాలను కోల్పోయారు. 10మందికి పైగా స్వల్ప గాయాలయ్యాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు డివైడర్‌ను దాటి అవతలి వైపు రోడ్డుపైకి దూసుకెళ్లింది. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని బస్సు బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగి రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మరణించారు. మంటల తీవ్రతకు వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సుమారు పదిమందికి పైగా స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటానికి ఒక డీసీఎం డ్రైవర్ చూపిన సాహసమే కారణం. మంటలు వ్యాపిస్తున్న సమయంలో ఆయన తన వాహనాన్ని ఆపి, బస్సు అద్దాలను పగులగొట్టారు. దీంతో ప్రయాణికులు కిటికీల గుండా బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. అయితే ప్రయాణికుల లగేజీ మొత్తం మంటల్లో బూడిదైపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..