మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 17) మరోసారి సీబీఐ విచారణకు హాజరుకానున్నారు ఎంపీ అవినాష్‌రెడ్డి. ఇందుకోసం సోమవారం ఉదయం 5.30 గంటలకు పులివెందుల నుంచి హైదరాబాద్ బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ కార్యాలయానికి ఆయన వెళ్లనున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే 4 సార్లు అవినాశ్ రెడ్డిని విచారించింది సీబీఐ. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయడంతో నెక్ట్స్ ఏం జరగబోతుందన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు అవినాశ్ రెడ్డి తండ్రిని భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ ఆ వెంటనే హైదరాబాద్ తరలించి కోర్టులో హాజరుపరిచారు. 14రోజుల రిమాండ్ విధించడంతో భాస్కర్ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆవెంటనే 10రోజులు కస్టడీకి అప్పగించాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. ఇదిలా కొనసాగుతుండగానే ఆదివారం సాయంత్రం పులివెందుల వెళ్లిన సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. విచారణకు హాజరయ్యేందుకు వస్తానని అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులతో చెప్పారు.
ఇక ఇటీవల ఈ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే . అయితే సీబీఐ విచారణపై ఆరోపణలు చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి. వాస్తవాల ఆధారంగా విచారణ జరపాలన్నారు. స్టాంప్ పేపర్లపై విచారణ ఏదీ? అంటూ సీబీఐని ప్రశ్నించారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఇక చంచల్‌గూడ జైల్లో ఉన్న భాస్కర్‌రెడ్డిని పది రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోరిన సీబీఐ పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని భాస్కర్‌రెడ్డికి న్యాయస్థానం తెలిపింది. ఫైనల్‌గా భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన రోజే అవినాష్ రెడ్డికి సైతం నోటీసులు అందడం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..