
శ్రీకాళహస్తీశ్వర స్వామి సాక్షిగానే సెల్‌ఫోన్ కౌంటర్ వద్ద భక్తుల నిలువు దోపిడీ జరుగుతోంది. భక్తులు ప్రశ్నిస్తే అది అంతే అంటున్న సిబ్బంది తీరు ఉంటోంది. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల బ్యాగ్, కెమెరా, సెల్‌ఫోన్‌లను భద్రపరిచేందుకు ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద ఉన్న బోర్డులో ఒక్కో దానికి ఒక్కో రేటు నిర్ణయించినట్లు బోర్డు కూడా ఏర్పాటు చేసినా భక్తుల దోపిడీ మాత్రం ఆగనంటోంది. భక్తుల ముక్కు పిండి మరీ నిర్ణయించిన ధరలు కాకుండా వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. శ్రీకాళహస్తి ఆలయంలోకి ప్రవేశించే ఒకటో నెంబర్ గేటు, సిఆర్ఓ కార్యాలయం, ఆలయ ముఖద్వారంలోని అంజి గణపతి ఆలయంతో పాటు కంచు గడప వద్ద నాలుగు చోట్ల సెల్‌ఫోన్, బ్యాగులు, కెమెరాలు భద్రపరిచే కేంద్రాలను దేవస్థానం ఏర్పాటు చేసింది. సెల్‌ఫోన్‌కు రూ. 5, బ్యాగ్‌కు రూ. 5, కెమెరాకు రూ. 10 రుసుము వసూలు చేయాలని ఆలయ ఈవో ఆదేశాల మేరకు కౌంటర్ వద్ద బోర్డు ఉన్నా ఇందుకు భిన్నంగా వసూలు చేయడంపై పలు ఫిర్యాదులు కూడా ఆలయ అధికారులకు అందుతున్నాయి.
భక్తుల నుంచి నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తున్న కౌంటర్ల సిబ్బందితో భక్తులు గొడవ పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇవేవీ పట్టించుకోని దేవస్థానం సెల్‌ఫోన్ కౌంటర్స్ వద్ద కొనసాగుతున్న దందాకు సహకరిస్తున్నట్టు వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది. ఇక్కడ ఒకటే కాకుండా వాహనాల పార్కింగ్‌లోనూ ఇదే దందా కొనసాగుతోంది. నిత్యం శ్రీకాళహస్తికి వచ్చే వందలాది వాహనాల పార్కింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది చేతివాటం కొనసాగుతోంది. ఒక వాహనం పార్కింగ్ ఫీజు కింద రూ 70 నుంచి రూ. 200 వరకు వసూలు చేస్తున్న సిబ్బంది భక్తులకు రసీదు ఇవ్వకుండానే పార్కింగ్ ఫీజు మొత్తాలను జేబుల్లో నింపుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఆలయానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నా పట్టించుకోకపోవడం శివయ్య సన్నిధిలో కొనసాగుతున్న నయా దందాగా మారింది.