Uttarandhra: రసవత్తరంగా మారిన ఎమ్మెల్సీ ఎన్నికలు.. నువ్వా నేనా అంటున్న ఉపాధ్యాయ సంఘాలు
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. మరి కొద్దిరోజుల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలను అభ్యర్థులు ఎవరికి వారే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉపాధ్యాయ సంఘాలు సైతం తాము మద్దతిచ్చే అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నాయి. గతం కంటే ఈసారి ఓటర్ల సంఖ్య కూడా పెరిగారు. పోటీ చేస్తున్నవారి సంఖ్య కూడా పెరిగింది. దీంతో మొదటి ప్రాధాన్యత ఓటుపైనే అందరూ తమ దృష్టి సారిస్తున్నారు. పోటీ చేసిన వారికి మొత్తం పోలైన ఓట్లలో కనీసం 50 శాతం ఓట్లు రావాలి. లేకుంటే 2వ ప్రాధాన్యత ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మద్దతు ఇవ్వని వారిని కూడా పోటీలో ఉన్నవారు రెండో ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం పది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే వారిలో ప్రధాన పోటీ మాత్రం పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరి, పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు, ఏపీటీఎఫ్ బలపరుస్తున్న అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మల మధ్య కనిపిస్తుంది. విజయగౌరికి ఉత్తరాంధ్రలో బలమైన యూటిఎఫ్ సంఘాలు మద్దతు తెలిపాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ముగ్గురు ప్రధాన అభ్యర్థుల మధ్యే సాగుతుందన్న ప్రచారంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన బహుజన సంఘాలు బలపరుస్తున్న అభ్యర్థి పోతల దుర్గారావు కూడా ప్రచారంలో స్పీడు పెంచారు. ప్రైవేటు పాఠశాలల నుంచి పోటీ చేస్తున్న సుంకర శ్రీనివాసరావు కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరు కూడా ఈ ఎన్నికల్లో ఎంతో కీలకం కానున్నారు. మొదట ప్రాధాన్యత ఓటు శాతం ప్రధాన అభ్యర్థులకు భారీగా తగ్గే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. అదే జరిగితే ఎన్నికల్లో రెండవ ప్రాధాన్యత ఓటు కీలకం కానుంది. ప్రధానంగా ఈ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్సీ ఏపిటిఫ్ బలపరిచిన ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మకు అధికార టిడిపి మద్దతు ప్రకటించింది. దీంతో ఎమ్మెల్యేలు, మంత్రులు విస్తృత ప్రచారం చేస్తూ రఘువర్మను గెలిపించాలని కోరుతున్నారు. అయితే కూటమిలో కూడా కొంత చీలిక కనిపిస్తుంది. టిడిపి రఘువర్మకు మద్దతు ప్రకటిస్తే మిత్రపక్ష పార్టీ బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ మాత్రం తన మద్దతు గాదె శ్రీనివాసులు నాయుడు కి ప్రకటించారు. దీంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు పాకలపాటి రఘువర్మ, గాదె శ్రీనివాసులు నాయుడు, కోరెడ్ల విజయగౌరి మధ్య ఉందని ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నప్పటికీ ఇతర అభ్యర్థులు కూడా బలంగా గెలుపు కోసం పనిచేస్తున్నారు.
గత కొద్ది రోజులుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్ని కల ప్రచారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అభ్యర్థులు జోరుగా చేపడుతున్నారు. ఈ ప్రచారం నెల 25న సాయంత్రం 4 గంటలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో బరిలో ఉన్న అభ్యర్ధులు మరియు వారికి మద్దతు ఇస్తున్న ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రచారంలో స్పీడు పెంచాయి. పాఠశాలల్లో వివిధ సంఘాలకు చెందిన ఉపాధ్యాయులు ఉండడంతో రాజకీయాలు జోరందుకున్నాయి. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం జరుగుతున్న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి..
