అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరి ఎమ్మెల్యే రోజా(Roja) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 160 గెలుచుకుంటుందని అచ్చెన్నాయుడు(Achennaidu) అంటున్నారని.. అది సాధ్యమయ్యే విషయం కాదని అన్నారు. టీడీపీ తలకిందులుగా తపస్సు చేసినా ఇప్పుడున్న 23 సీట్లు కూడా గెలవలేరని విమర్శించారు. ప్రజల్లో టీడీపీకి ఏ మాత్రం ఆదరణ ఉందో తెలుసుకోవాలంటే అచ్చెన్నాయుడు టెక్కలిలో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఒకవేళ ఎన్నికలకు వస్తే ప్రతి పోలింగ్ బూత్‌లో మహిళలు తమ శక్తిని చూపేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యఖ్యానించారు. చంద్రబాబు, లోకేశ్‌కు స్త్రీల గురించి మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్త్రీల పక్షపాతి అయిన సీఎం జగన్(CM Jagan).. రాష్ట్రంలోని ప్రతి మహిళా ఆత్మగౌరవంతో జీవించలానే సంకల్పంతో వారి కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. ఆయన మహిళలకు అన్నే కాదు.. దేవుడు అని అన్నారు. జగన్ వెనుక మహిళాశక్తి ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘జగన్, చంద్రబాబు బోత్ ఆర్ నాట్ సేమ్’ అని స్పష్టం చేశారు.
మరోవైపు.. ఎమ్మెల్యే రోజా మాటలపై మాజీ మంత్రి, టీడీపీ లీడర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. మహిళా దినోత్సవం సభ అనే విషయం మర్చిపోయి.. ‘జబర్దస్త్’ వేదిక అనుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేశ్‌ను తిట్టేందుకే రోజా తన ప్రసంగ సమయాన్ని కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దమ్ముంటే ఒక వేదిక మీదకు రా… మా పార్టీ నుంచి తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనితను పంపిస్తాం. ఎవరేం చేశారో తేల్చుకోవచ్చు. ఆమెతో చర్చకు సిద్ధమా’ అని రోజాకు సవాల్ విసిరారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన పెళ్లి కానుకను సీఎం జగన్ ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు.
Also Read
Prabhas: ప్రభాస్‌తో అనుష్క పెళ్లి.. కృష్ణంరాజు సతీమణి ఏమన్నారంటే..