గత 50 ఏళ్లల్లో ఏనాడు కోనసీమ(Konaseema) లో ఇలాంటి ఘటనలు జరగలేదని మంత్రి పినిపే విశ్వరూప్(Minister Vishwaroop) అన్నారు. మంగళవారం నాడు అమలాపురంలో జరిగిన అల్లర్లు ఆవేదన కలిగించాయని అన్నారు. జిల్లా పేరును అంబేడ్కర్(Ambedkar) పేరుగా మార్చవద్దని శాంతియుతంగా జరిగుతున్న ఆందోళనల్లో కొన్ని సంఘ విద్రోహ శక్తులు, రౌడీ షీటర్లు చేరి ఉద్యమాన్ని చెడుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో పాటు, ఎమ్మెల్యే సతీశ్ ఇంటిని తగలబెట్టారని, ఈ ఘటనల వెనుక టీడీపీ, జనసేన నాయకులు ఉన్నారని వెల్లడించారు. నిన్న జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఆందోళనకారులు తగులబెట్టిన తన ఇంటిని మంత్రి విశ్వరూప్ పరిశీలించారు. అమలాపురం ప్రజలు ఎప్పుడూ తప్పుడు ఆలోచనతో లేరన్న మంత్రి.. మంగళవారం జరిగిన ఘటనలకు కోనసీమ సాధన సమితి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. గమ్యం లేని ఉద్యమాన్ని తమ ఇళ్లవైపు మళ్లించారని ఆక్షేపించారు. అక్కడికి సమీపంలోనే ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆనందరావు ఇంటిపై ఎందుకు దాడి చేయలేదని ప్రశ్నించారు. అమలాపురంలో జరిగిన ఘటనల వెనుక టీడీపీ, జనసేన నాయకులు ఉన్నారని ఆరోపించారు. ప్రజలు సంయమనం పాటించాలని, అనవసరంగా రోడ్ల పైకి రావద్దని సూచించారు.
కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ.. కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాదిగా చేరుకున్న నిరసనకారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురికి గాయాలయ్యాయి. సెక్షన్ 144, 30 పోలీస్ యాక్టు ఆంక్షలను లెక్కచేయని ఆందోళనకారులు తీవ్ర నిరసన తెలపడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అమలాపురం వీధులు వేల మంది ఆందోళనకారులతో నిండి పరిస్థితి చేయిదాటింది. జిల్లాల విభజనలో భాగంగా కోనసీమ జిల్లాను ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి