ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇప్పటికే నేరుగా ఇంటికే రేషన్ సరకులను అందిస్తోన్న ఏపీ ప్రభుత్వం త్వరలోనే రేషన్ సరకుల జాబితాలో మరికొన్ని ఆహార ధాన్యాలను చేర్చనుంది. ఈ విషయమై తాజాగా ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పలు కీలక విషయాలు వెల్లడించారు. తాజాగా కేంద్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శిని కలిసిన ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధాన్యం సేకరణ అంశాలపై పౌరసరఫరాల శాఖ అధికారులతో చర్చించినట్లు తెలిపారు.
త్వరలోనే రేషన్ కార్డు దారులకు గోధుమ పిండి, రాగులు, జొన్నలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్నా అన్న మంత్రి సంవత్సర కాలంలో సివిల్ సప్లై మంత్రిత్వశాఖలో అనేక మార్పులు తీసుకు వచ్చామని తెలిపారు. రైతులకు దళారి వ్యవస్థను దూరం చేయడంతో పాటు రైతులకు సరైన పంట ధర వచ్చేలా చేశామన్నారు. నేరుగా రైతుల వద్ద నుంచి పంటను కొనుగోలు చేస్తున్నామని, దీంతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. ఏపీలో 22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఆపైన ఎంత వచ్చిన సేకరిస్తామని హామి ఇచ్చారు. ఇంటింటికి రేషన్ పంపిణీ విషయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ని కేంద్ర మంత్రి ప్రశంసించారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. త్వరలోనే ఏపీ ప్రజలకు రేషన్ సరఫరాలో గోధుమ పిండి, రాగులు, జొన్నలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.
మళ్ళీ జగన్ కి 175 సీట్లు రావడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై కూడా స్పందించారు మంత్రి.. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ జరగకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం తో పోరాటం చేస్తాం లేక మేమే విశాఖ స్టీల్ ప్లాంట్ ను సాధించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చారు. అసలు కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి అయ్యారో తెలియదని, ముఖ్యమంత్రి ని చేసిన కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయిందని ఎద్దేవా వేశారు. లోకేష్‌ను జోకర్‌లా చూస్తున్నారన్న కారుమూరి.. వచ్చే ఎన్నికల్లో లోకేష్, చంద్రబాబు ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..